దేశంలో కాషాయం

దేశంలో కాషాయం
x
Highlights

ఈశాన్య రాష్ట్రాల పోరులో కమలం పరిపూర్ణంగా వికసించింది. మోదీ-షా వ్యూహానికి విజయం మరోసారి సాగిలపడింది. జీఎస్టీ చావు దెబ్బ తీస్తుందన్న ప్రత్యర్థులు నోటికి...

ఈశాన్య రాష్ట్రాల పోరులో కమలం పరిపూర్ణంగా వికసించింది. మోదీ-షా వ్యూహానికి విజయం మరోసారి సాగిలపడింది. జీఎస్టీ చావు దెబ్బ తీస్తుందన్న ప్రత్యర్థులు నోటికి తాళం వేస్తూ నోట్ల రద్దు శరాఘాతం అవుతుందన్న కూతలకు పుల్‌స్టాప్‌ పెడుతూ కుల సమీకరణాలు కూల్చేస్తాయని జోస్యానికి ముకుతాడు వేస్తూ మతతత్వ బీజేపీని అదే పడగొడుతుందని బాకా ప్రసంగాలకు కళ్లెం వేస్తూ ఈశాన్య ప్రజలు అదిరిపోయేలా ఓటు గుద్దారు. ప్రత్యర్థి పార్టీలు, వ్యతిరేక శక్తుల అంచనాలను తలకిందులు చేసే తీర్పిచ్చారు. ఏమైతేనేం చివరకు ఈశాన్యం కాషాయం వశమైంది. మూడింట రెండు రాష్ట్రాలు మోదీకి జై కొట్టాయి. 29 రాష్ట్రాల్లో ముప్పావు వంతు కాషాయానికి దాసోహమంటున్నాయి.

ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 20 రాష్ట్రాలు కమలం ఖాతాలో పడిపోయాయి. గెలిస్తే అది నా ఖ్యాతి ఓడితే నాదే బాధ్యత అంటూ అన్నీ తానై ప్రచార బాధ్యతలు మోసిన మోడీ ఈశాన్యాన కాషాయ పవనాలను బలంగానే వీయించాడు. మూడింట రెండు రాష్ట్రాల్లో పార్టీని విజయతీరాలకు చేర్చాడు. ఇలా ఎలా చూసినా భారత దేశ చిత్రపటంలో కమలనాధులు అన్ని ప్రాంతాల్లోనూ విస్తరించారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్‌ ఇండియా నినాదంతో కాషాయం ఈ రాష్ట్రాల్లో తనదైన పట్టు సాధించింది. దేశంలో ఉన్న మొత్తం 29 రాష్ట్రాల్లో హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, యూపీ మధ్యప్రదేశ్, మణిపూర్, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, తాజాగా త్రిపుర, నాగాలాండ్‌, జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్‌, బీహార్‌లో అధికారంలోకి వచ్చింది. కచ్చితంగా ఇది ఒక రికార్డే.

మతతత్వ పార్టీ ముద్రను తొలగించుకుని దేశంలో బలీయమైన శక్తిగా ఎదిగింది బీజేపీ. ఒకప్పుడు సింగిల్ డిజిట్‌తో లోక్‌సభలో ఉన్న కమలనాథులు అనతికాలంలోనే దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో పాగా వేయడం ఆషామాషీ విషయమేమీ కాదు. నూటికి నూరుపాళ్లు ఊహించని పరిణామమే. హిందుత్వ అజెండాతో వెళుతున్న కాషాయదళాన్ని ప్రజలు ఆదరిస్తున్నారనడానికి వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో వరిస్తున్న విజయాలే ఉదాహరణ. ఏ లెక్కన చూసినా దేశంలో బీజేపీ బలం రోజురోజుకూ పెరుగుతుంది. గుజరాత్‌ను వరుసగా ఆరోసారి నిలబెట్టుకోవడంతో పాటు.. అటు హిమాచల్‌ప్రదేశ్‌ను కాంగ్రెస్ నుంచి లాక్కోవడం మరిచిపోకముందే ఈశాన్యంలోనూ పట్టు సాధించింది. పక్కా స్కెచ్‌తో పాగా వేసేసింది. గతంలో ఏ పార్టీ కూడా ఒకేసారి ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో లేదు. 24 ఏళ్ల కిందట కాంగ్రెస్ అత్యధికంగా 18 రాష్ట్రాల్లో పాగా వేసింది. 1993లో మొత్తం 26 రాష్ట్రాల్లో 15 కాంగ్రెస్ చేతుల్లోనే ఉండేవి. ఒకటి సంకీర్ణ ప్రభుత్వం కాగా.. మరో రెండు కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతు తెలిపిన సీపీఎం ప్రభుత్వాలు. మళ్లీ ఇన్నాళ్లకు 20కి పైగా రాష్ట్రాల్లో నేరుగా బీజేపీ, ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్నాయి.

2014లో కేంద్రంలో మోదీ ప్రభంజనం తర్వాత బీజేపీ బలం అసాధారణంగా పెరిగిపోయింది. సార్వత్రిక ఎన్నికల తర్వాతే బీజేపీ కీలక రాష్ట్రాల్లో పాగా వేయగలిగింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ కేవలం ఐదు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉండేది. 2014 ఎన్నికల తర్వాత సీను పూర్తిగా మారిపోయింది. అసలుసిసలు సక్సెస్ 2017లోనే సాధించింది బీజేపీ. ఏకంగా ఆరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. అతిపెద్ద రాష్ట్రమైన యూపీని క్లీన్‌స్వీప్ చేయడం విశేషం. ఉత్తరాఖండ్‌లోనూ బంపర్ మెజార్టీతో గెలిచింది. ఈ ఏడాది కర్ణాటక, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ప్రభుత్వాలు ఉండగా.. మరో పెద్ద రాష్ట్రమైన కర్ణాటక లక్ష్యంగా బీజేపీ ఇప్పుడు పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌లేని భారత్ అంటూ మోదీ చేస్తున్న ప్రచార లక్ష్యంపై బీజేపీ పట్టు సాధిస్తుందా? దక్షిణాన పట్టు సాధిస్తుందా? పాగా వేస్తుందా? వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories