నైపుణ్యానికి అగ్నిపరీక్ష

Submitted by arun on Mon, 04/02/2018 - 12:26
H-1B Visa Application

కలల ఉద్యోగానికి కఠిన పరీక్ష సిద్ధం అయ్యింది. అమెరికాలో ఉద్యోగాల కోసం జారీ చేసే హెచ్ వన్ బీ వీసా ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. వీసా జారీ ప్రక్రియలో అవకతవకలకు ఆస్కారం లేకుండా.. ఇంతకుముందెన్నడూ లేనంతగా ట్రంప్ సర్కారు.. రకరకాల నిబంధనలను విధించింది. భారతీయులు ఎక్కువగా ఆధారపడే ఈ వీసా కోసం ఇవాళ్టి నుంచి ధరఖాస్తులను స్వీకరించనున్నారు. 

ప్రత్యేక నైపుణ్యాలున్న వివిధ దేశాలకు చెందిన ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు వీలు కల్పించే హెచ్‌1బీ వీసాల జారీ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. అగ్రరాజ్యాన ఉద్యోగం చేయాలని కలలు కంటున్న భారతీయులతో పాటు చైనా ఉద్యోగులు ఎక్కువగా ఈ వీసాను వినియోగించుకుంటారు. అయితే ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక హెచ్ వన్ బీ వీసా ప్రక్రియలో సమూల మార్పులు తీసుకొచ్చారు. గతంలో ఎన్నడూ లేనంతగా కఠిన నిబంధనలను విధించారు. 

హెచ్ వన్ బీ వీసాలను యేడాదికి 65 వేలకు పరిమితం చేశారు. ఒకటి కంటే ఎక్కువ ధరఖాస్తు చేస్తే.. క్యాన్సిల్ చేయనున్నారు. లాటరీ ద్వారా ఎంపిక కావడానికి ఎక్కువ అవకాశాలుంటాయని భావిస్తూ.. ఆయా సంస్థలు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తుంటారు. అయితే కంప్యూటర్‌ ద్వారా లాటరీ తీసే విషయమై ఇంకా స్పష్టత ఇవ్వకుండానే ధరఖాస్తులను స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. 

నైపుణ్యానికే పెద్దపీఠవేస్తామంటూ.. ఈ వీసాల జారీ ప్రక్రియలో రకరకాల రూల్స్  ను అమలు చేస్తున్నారు. చిన్న చిన్న తప్పులను కూడా ఉపేక్షించబోమని అమెరికా పౌర, వలస సేవల సంస్థ.. యూఎస్‌సీఐఎస్‌ ఆదేశాలు వచ్చాయి. దరఖాస్తులోని అన్ని అంశాలను సరిగ్గా పూర్తి చేయాలని, పాస్‌పోర్టు ప్రతిని కూడా జతపర్చాలని ఆయా కంపెనీలకు సూచించింది. అంతేకాకుండా.. వీసా ఇంటర్వ్యూ, పాస్‌పోర్టుపై స్టాంపింగ్‌ నిమిత్తం దరఖాస్తుదారు అమెరికా దౌత్య కార్యాలయాలకు హాజరయినప్పుడు.. గత ఐదేళ్ల కాలంలోని సోషల్ మీడియా ప్రొఫైల్‌ వివరాలు, ఈ మెయిళ్లు, ఫోన్‌ నంబర్లకు సంబంధించిన వివరాలతో సిద్ధంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఇతర దేశాల వారి కన్నా భారత కంపెనీలు వీసా రుసుము ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో దరఖాస్తుకు 6 వేల డాలర్లు చెల్లించాలని పేర్కొంది. 

వీసాల ప్రక్రియలో అవకతవకలను నివారించి అమెరికా సిబ్బంది ప్రయోజనాలను కాపాడడం ముఖ్యమని యూఎస్‌సీఐఎస్‌ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా పనిచేసే చోట్లకు వెళ్లి తనిఖీ చేసే ప్రక్రియను విస్తృతం చేస్తామని పేర్కొంది. ఇటు ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపేసిన యూఎస్‌సీఐఎస్‌ వీటి ప్రారంభ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. 
 

English Title
Toughest H-1B Application Process to Begin Today

MORE FROM AUTHOR

RELATED ARTICLES