శ్రీవారి సన్నిధి... వివాదాలకు పెన్నిధా? వివాదాల్లోకి లాగుతున్నదెవరు?

Submitted by santosh on Sat, 06/09/2018 - 11:32
tirumala tirupathi devasthanam

నిత్య కల్యాణం పచ్చతోరణంలా కనిపించే శ్రీవారి సన్నిధి ఇప్పుడు సకల వివాదాలకూ కేంద్ర బిందువుగా మారుతోంది. నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, వార్షికోత్సవ సేవలతో క్షణం కూడా తీరిక లేని వెంకన్న అధికారుల ఆధిపత్య పోరు మధ్య నలిగిపోతున్నాడు. నిరంతరం హరినామ స్మరణతో మార్మోగాల్సిన కొండ అపవిత్ర కార్యకలాపాలతో అప్రతిష్ట పాలవుతోంది. నిఖిల లోకాన్ని నిరంతరం కాపాడే ఆ దేవ దేవుడికి సరైన నిద్ర, విరామమే కరువవుతోంది. 

స్వామి అలంకార ప్రియుడు.. అసలు వెంకన్న తిరువాభరణాలే కళ్లు చెదిరిపోయేంత నవరత్న ఖచితమై ధగధగలాడుతుంటాయి.. రోజుకో రకంగా స్వామి వారిని నగలతో అలంకరించి అర్చకులు తరిస్తుంటారు.. స్వామి వారి బంగారు ఆభరణాలే దాదాపు 38 వేల కోట్ల రూపాయలుండొచ్చన్నది ఓ అంచనా.. రాజులు, చక్రవర్తులు, సామంతుల కాలం నుంచి నేటి కార్పొరేట్ భక్త గణం వరకూ ఆ స్వామికి ఎన్నెన్నో మొక్కులు చెల్లించారు.. వెలకట్టలేని ఆస్తులను కానుకలుగా ఇచ్చారు. స్వామి ఆభరణాల మార్కెట్ వాల్యూ కన్నా వాటికున్న పురాతత్వం విలువ వెలకట్టలేనిది.. సహస్రనామ మాల, పచ్చ పొదిగిన కంఠాభరణం, వక్షస్థల లక్ష్మి, లక్ష్మీ హారాలు ఎప్పుడూ మూల మూర్తికి అలంకరించి ఉంటాయి. మిరాశీ అర్చకుల అదుపులో ఉన్న ఈ ఆభరణాలను టిటిడి యాజమాన్యం స్వాధీనం చేసుకున్నాక కాలక్రమంలో నగల మాయం ఆరోపణలు వెలుగు చూశాయి. ఈ నగలను భద్రత కోసం ఎస్ బిఐ లో డిపాజిట్ చేశారు.. దీనిపై వడ్డీ బంగారం రూపంలోనే చెల్లించే ఒప్పందం కుదిరింది.అయితే ఇప్పుడీనగలే మాయమయ్యాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కృష్ణ దేవరాయలి కాలం నాటినుంచీ ఉన్న నగలు ఇప్పుడు కనిపించడం లేదన్నది సాక్షాత్తూ అర్చకులే చెబుతున్న మాట.. స్వామి వారి మెడలో వేసే వజ్రాల హారంలో గులాబీ రంగు వజ్రం మాయమైందని.. ఆ వజ్రం స్థానంలో ఒక కెంపును పెట్టి మాయ చేస్తున్నారని.. ఆ కెంపు కూడా భక్తులు నాణాలు విసరడంతో విరిగిపోయిందనీ చెబుతోంది టిటిడి.. అయితే అవన్నీ అబద్ధాలేనని.. స్వామి నగలు మాయమయ్యాయనీ మొన్నటి వరకూ ఆలయ ప్రధాన అర్చకులు గా కొనసాగిన రమణ దీక్షితులు చెబుతున్నారు. స్వామి ఆభరణాలను ప్రదర్శించాలన్నా, వేలం వేయాలన్నా ఆగమాలు అనుమతించాలని చెప్పే అధికారులు తిరుమలలో ఆలయాలు, మండపాలను కూలగొట్టే సమయంలో ఎవరి అనుమతి తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు. అనువంశిక అర్చకత్వం మా హక్కని వాదిస్తున్న రమణ దీక్షితులు పదవి పోయాకే ఎందుకు గళం విప్పారన్నదీ సందేహమే.. అర్చకత్వ హక్కులు కలిగిన ఆ నాలుగు కుటుంబాల్లో పొరపొచ్చాలే బయటి శక్తులు చొరబడేందుకు ఆస్కారం కల్పించాయి. హరి నామస్మరణ తో మార్మోగాల్సిన తిరుమల గిరుల్లో చాలా నిశ్శబ్దంగా అన్యమత ప్రచారం జరుగుతోందన్నది మరో ఆరోపణ..గతంలోనే ఇందుకు బాధ్యులు కొందరిని పట్టుకున్నారు..

భక్తికి, ముక్తికి ఆలవాలంగా నిలవాల్సిన పుణ్య తీర్ధం ఇప్పుడు వివాదాల ముంగిట్లో నిలిచింది. ప్రభుత్వం టిటిడి ప్రతిష్టను కాపాడకపోతే.. తామే స్వయంగా రంగంలోకి దిగుతామని, ఉద్యమిస్తామనీ వివిధ పీఠాధిపతులు, స్వామీజీలు చెబుతున్నారు. ఆలయాలపై ప్రభుత్వాల పెత్తనాలు ఏమిటసలు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం.. అందునా హిందూ ధర్మంపై  అచంచల విశ్వాసమే ఊపిరిగా నడుస్తున్న తిరుమల ఎందుకు వివాదాల ముంగిట్లో నిలవడమే విచారకరం.

English Title
tirumala tirupathi devasthanam

MORE FROM AUTHOR

RELATED ARTICLES