పవిత్ర స్థలంలో ప్రశాంతత కరవవుతోంది!!

పవిత్ర స్థలంలో ప్రశాంతత కరవవుతోంది!!
x
Highlights

తిరుమల కొండపై పరిణామాలు భక్తులను కలవరానికి గురిచేస్తున్నాయి.. స్వామి వారి సేవలో అక్రమాలు జరుగుతున్నాయంటూ రమణ దీక్షితులు ఆరోపించిన వెంటనే ఉద్యోగ సంఘాలు...

తిరుమల కొండపై పరిణామాలు భక్తులను కలవరానికి గురిచేస్తున్నాయి.. స్వామి వారి సేవలో అక్రమాలు జరుగుతున్నాయంటూ రమణ దీక్షితులు ఆరోపించిన వెంటనే ఉద్యోగ సంఘాలు నల్ల బ్యాడ్జీలతో నిరసనలకు దిగడం కలకలం రేపుతోంది.. వెంకన్న సన్నిధిలోనే నిరసన తెలిపి ఉద్యోగులు తిరుమల పవిత్రతను కాలరాస్తున్నారా? కొండపై ఏం జరుగుతోంది?

శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు, టిటిడి సిబ్బంది మధ్య కోల్డ్ వార్ పవిత్ర పుణ్యక్షేత్రం ప్రశాంతతను దెబ్బ తీస్తోందా? రమణ దీక్షితుల ఆరోపణలను ఒక్క తాటిపై ఖండిస్తున్న టిటిడి సిబ్బంది ఇవాళ తమ నిరసనను మూకుమ్మడిగా నల్ల బ్యాడ్జీలు ధరించి వ్యక్తం చేయడం కలకలం రేపింది. స్వామికి, భక్తులకు అనుసంధాన కర్తలుగా ఉండే అర్చకులు, ఉద్యోగులు చరిత్రలోనే తొలిసారిగా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.. ఈ నిరసన స్వామి వారి గర్భ గుడిలోనూ ప్రత్యక్ష మైంది.. పూజలు చేసే అర్చకుల నుంచి సాధారణ ఉద్యోగుల వరకూ ప్రతీ ఒక్కరూ నల్ల బ్యాడ్జీలు ధరించడంతో దైవ దర్శనానికి వచ్చిన భక్తులు కాస్త ఖంగు తిన్నారు..ఎటు చూసినా నల్ల బ్యాడ్జీలు ధరించిన సిబ్బందే కనిపించడంతో అసలేం జరుగుతోందో తెలీక తికమకపడ్డారు.
టీటీడీపై మాజీ అర్చకులు రమణ దీక్షితులు తీవ్ర స్ధాయిలో ఆరోపణలు గుప్పిస్తున్న నేపధ్యంలో .. తమ నిరసన తెలియజేసేందుకు సిబ్బంది ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. మూడు రోజుల పాటు ఇదే తరహాలో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్నామని ఉద్యోగులు ప్రకటించారు.
అయితే వీరి తీరును భక్తులు మాత్రం తీవ్రంగా తప్పు బడుతున్నారు. అశుభానికి చిహ్నంగా భావించే నలుపు రంగు బ్యాడ్జీలతో విధులు నిర్వహించడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. స్వామి సన్నిధిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటారా అని నిలదీస్తున్నారు..శుభ కార్యాలకోసం కొండ మీదకొస్తే.. ఇక్కడ స్వామి సన్నిధిలోనే అశుభం పలకడం ఏంటని బాధపడుతున్నారు.

ఉద్యోగుల మధ్య స్పర్ధలను స్వామి వారి సేవకు ఎందుకు ఆపాదిస్తున్నారన్నది ప్రశ్న..తిరుమల కొండ అంటేనే పవిత్రతకు మారుపేరు.. ప్రతీ భక్తుడు స్వామి సన్నిధిలో నిలిచేది క్షణకాలమైనా ఎంతో ప్రశాంతతను పొందుతాడు.. అలాంటి పవిత్రాలయాన్ని ఇలాంటి రాజకీయాలకు వేదికగా మార్చడం క్షమించరాని నేరమని భక్తులు బాధపడుతున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా నడుచుకునే హక్కు ఉద్యోగులకు లేదన్నది మరికొందరి వాదన. ఆగమ శాస్త్రం ప్రకారం నలుపు అశుభానికి సంకేతం.. అలాంటి సంకేతాలేవీ పవిత్రమైన కొండపై కనపడకూడదు.. కానీ సాక్షాత్తూ స్వామి వారి గర్భగుడిలోనే నలుపు రంగు బ్యాడ్జీలు ధరించడం దారుణమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వ్యక్తుల మధ్య ఘర్షణలకు తిరుమల కొండను వేదికగా వాడుకుంటున్నారా? సిబ్బంది మధ్య గొడవలలోకి స్వామి వారినీ, ఆలయాన్ని, పవిత్రతను కూడా లాగుతున్నారా? అసలు పదవిలో లేని రమణ దీక్షితుల మాటలకు విలువ ఉంటుందా? స్వామి వారిపై కనిపించని అదృశ్య శక్తులు పెత్తనం పెడుతున్నాయా?అందరి వాడైన వెంకన్న కొందరి కుట్రలకు బలవుతున్నాడా?

Show Full Article
Print Article
Next Story
More Stories