టైటిల్‌ పెట్టావ్‌ సరే... జాగ్రత్తగా తియ్‌ అన్నారు

Submitted by arun on Mon, 02/12/2018 - 11:52
Venky Atluri

స్నేహగీతం సినిమాతో నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి తొలి ప్రేమసినిమాతో దర్శకుడిగా మారారు వెంకీ అట్లూరి. తొలి ప్రయత్నంలోనే విజయాన్ని సొంతం చేసుకున్న ఆయనపై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తున్నది. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం తొలిప్రేమ. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో దర్శకుడు వెంకీ అట్లూరి పాత్రికేయులతో చ్చటించారు.

‘‘నేనీ కథ తయారు చేసుకునేటప్పటికి ‘ముకుంద’ విడుదల కాలేదు. టీజర్‌ మాత్రమే విడుదలైంది. టీజర్‌ చూసి ఇలాంటి హీరో మనకు ఉంటే కథను బాగా చెప్పొచ్చని అనుకున్నా. మెగా ఫ్యామిలీ హీరో కదా! లవ్‌స్టోరీస్‌ చేస్తాడో లేదో అన్న అనుమానం కలిగింది. కొత్త తరహా కథలు చేయడానికి వరుణ్‌ సిద్థంగా ఉన్నాడని ‘కంచె’ చూశాక తెలిసింది. ‘వెన్‌ హ్యారీ మెట్‌ శాలీ’ సినిమాను బట్టి మనకు తగ్గటు ఓ కథ రాసి ‘లోఫర్‌’ షూటింగ్‌ టైమ్‌లో వరుణ్‌కి కథ చెప్పా. దిల్‌రాజు గారు నిర్మించాల్సిన సినిమా ఇది. ఆయన బిజీగా ఉండడంతో బాపినీడుని కలిసి కథ చెప్పాను. తనకు కూడా నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది. అనుకున్నట్లుగానే అన్నీ చక్కగా కుదిరాయి. డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించడం కోసం హీరోహీరోయిన్లు వెయిట్‌ తగ్గారు. వరుణ్‌ గడ్డం పెంచాడు. మరో సందర్భంలో రాశీఖన్నా బొద్దుగా మారింది. ‘తొలిప్రేమ’ టైటిల్‌ పెట్టినప్పుడు కొందరు ఏమీ అనలేదు. కొందరైతే ‘టైటిల్‌ పెట్టావ్‌ సరే! జాగ్రత్తగా తీయ్‌’ అన్నారు. కథ మీద నాకున్న నమ్మకంతోనే ముందుకెళ్లా. ఏ టెక్నీషియన్‌ అయినా సక్సెస్‌ కోసం తపన పడుతుంటారు. దేవి థియేటర్‌లో సినిమా చూసినప్పుడు ప్రేక్షకుల స్పందన చూసి మేం కోరుకున్న దాని కంటే ఎక్కువ అప్‌లాజ్‌ వచ్చిందని ఆనందించాం. సినిమా చూశాక రాఘవేంద్రరావుగారు, ఆర్‌.నారాయణమూర్తిగారు ఫోన్‌ చేసి అభినందించడం, కేటీఆర్‌గారు సినిమా చూసి ట్వీట్‌ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. తర్వాతి చిత్రం ప్రసాద్‌గారి బ్యానర్‌లోనే ఉంటుంది’’ అని అన్నారు.

English Title
tholi prema movie director venky atluri press meet

MORE FROM AUTHOR

RELATED ARTICLES