ఇంటిని చూస్తేనే వణికిపోతున్న జనం

Submitted by arun on Sat, 07/07/2018 - 09:10
Burari

ఆ ఇంటి వైపు చూడాలంటే.. ధైర్యం సరిపోవడం లేదు. తలచుకుంటేనే వణికిపోతున్నారు.. దాని గురించి ఆలోచించాలంటేనే.. హడలిపోతున్నారు. ఇక.. ఆ కాలనీలో నివాసమున్న వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు వాళ్లందరికీ కంటిమీద కునుకు లేదు. ఎందుకింత భయం.? దేనికీ వణుకు.?

ఢిల్లీ ఇప్పుడు ఈ పేరు వింటే బురారీ సామూహిక ఆత్మహత్యలే గుర్తొస్తున్నాయి. మోక్షం కోసం 11 మంది సామూహికంగా సూసైడ్ చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసు గుర్తొస్తేనే ఎక్కడో ఉన్న మనకే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటిది ఆ కాలనీలో ఉండేవాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అనుక్షణం భయంతో చచ్చిపోతున్నారు. 

భాటియా కుటుంబం సామూహిక ఆత్మహత్యల తర్వాత ఆ కాలనీ వాసుల్లో భయం మొదలైంది. పదే పదే పోలీసులు వస్తూ, పోతూ ఉండటం, టీవీల్లో వరుస కథనాలు ప్రసారం చేస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు ఆ ఇంటి వైపు చూడాలంటేనే ఎవ్వరికీ ధైర్యం సరిపోవడం లేదు. తలచుకుంటేనే వణికిపోతున్నారు దాని గురించి ఆలోచించాలంటేనే హడలిపోతున్నారు. ఇప్పటికే ఆ చుట్టుపక్కల్లో నివసించే చాలామంది వేరే ప్రదేశాలకు తరలి వెళ్లిపోయారు.

ఈ ఘటన తర్వాత స్థానికంగా ఉండే 21 ఏళ్ల అమ్మాయి భయంతో వణికిపోతోందని ఆమె తండ్రి చెప్తున్నాడు. లైట్‌ లేనిది ఇంట్లో ఉండలేక పోతుందని, చివరకు బాత్రూం డోర్‌ పెట్టుకోవడానికి కూడా భయపడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతానికి భాటియా ఫ్యామిలీ ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. దర్యాప్తు తర్వాత ఎవరికి అప్పగిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మృతురాలు నారాయణ్‌ దేవి మరో కుమార్తె, కుమారుడు పానిపట్‌, ఛిత్తోర్‌గఢ్‌లో స్థిరపడ్డారు. వారు కూడా ఈ ఇంటిని తీసుకోడానికి ముందుకురావట్లేదు. బంధువులు కూడా ఇంటి గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. 

ఆ ఇంటిని ఏం చేయాలనే దానిపై తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో స్థానికులు ఓ కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. కుటుంబమంతా సామూహికంగా ఆత్మహత్య చేసుకున్న ఇంటిని కొనుగోలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రారని, ఆ ఇంటిని దేవాలయంగా మార్చడమే ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు. కానీ పూర్తిస్థాయి దర్యాప్తు పూర్తైన తర్వాతే పోలీసులు ఆ ఇంటిని ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

Tags
English Title
Temple? Burari wonders what to do with ‘house of death’

MORE FROM AUTHOR

RELATED ARTICLES