హీటెక్కిస్తున్న టెంపరేచర్‌... మరో రెండు పెరిగితే అంతే!!

హీటెక్కిస్తున్న టెంపరేచర్‌... మరో రెండు పెరిగితే అంతే!!
x
Highlights

మంచుకొండలు మటుమాయం...కరిగిపోతున్న మంచు సముద్రాలు....సముద్రతీర మట్టం పెరుగుదల...అధికమైపోతున్న తుపానులు.... తరచూ కరువు కాటకాలు....పెరిగిపోతున్న...

మంచుకొండలు మటుమాయం...కరిగిపోతున్న మంచు సముద్రాలు....సముద్రతీర మట్టం పెరుగుదల...అధికమైపోతున్న తుపానులు.... తరచూ కరువు కాటకాలు....పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు... ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవే. అవన్నీ కూడా శీతోష్ణస్థితి మార్పులకు సంబంధించినవే. కాకపోతే మనం మాత్రం దేనికదేగా విడివిడిగా చూడడం అలవాటు చేసుకున్నాం. తాత్కాలిక చర్యలతో పబ్బం గడుపుకుంటున్నాం. రాబోయే విపత్తును విస్మరిస్తున్నాం. దేశంలో వడగాలులు సహజమే. కానీ ఒక్కసారిగా వాటి తీవ్రత పెరిగిపోవడం, అది సాధారణమైపోవడం మాత్రం అసహజం. 2015లో దేశంలో భయంకరస్థాయిలో వడగాలులు వీచాయి. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ అనేక అసహజ మరణాలు చోటు చేసుకున్నాయి. అప్పట్లో వడగాలుల కారణంగా కనీసం 2,500 మరణించినట్లు అంచనా. అలాంటి పరిస్థితులే పునరావృతం కానున్నాయి. శీతోష్ణస్థితి మార్పు ప్రభావం ఎలా ఉంటుందో దేశప్రజలకు అనుభవం లోకి వస్తోంది. ఇప్పుడు యావత్ ప్రపంచం ముందు ఉన్న సమస్య ఒక్కటే...ఉష్ణోగ్రత మరో రెండు డిగ్రీలు పెరగకుండా ఏం చేయాలన్నదే ఆ సమస్య.

భూతాపం పెరిగిపోతోంది... ఇది ఇప్పటి మాట కాదు...రెండు వందల ఏళ్ళ క్రితమే ఈ భావన రూపుదిద్దుకుంది. ఆల్పైన్ వ్యాలీలో పెద్ద పెద్ద శిలలు ఉంటాయి. అవి అక్కడకు వచ్చేందుకు గ్లేసియర్స్ భారీస్థాయిలో కరిగిపోవడం కారణమై ఉండవచ్చునని భావించారు. 1899 లో శీతోష్ణస్థితి మార్పులకు కార్బన్ డయాక్సైడ్ కారణం కావచ్చుననే వాదన మొదలైంది. 1985లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సు లో భూగోళం వేడెక్కేందుకు గ్రీన్ హౌస్ వాయువులు కారణం కావచ్చునని అన్నారు. శాస్త్ర సాంకేతిక పరిశోధనలు భూతాపం గురించి ఎంత హెచ్చరించినా ఫలితం లేకుండా పోతోంది. ఈ అంశంపై ప్రపంచ దేశాల మధ్య పారిస్ లో ఒక ఒప్పందం కూడా కుదిరింది. భూతాపాన్ని తగ్గించేందుకు ఏయే దేశాలు ఎప్పటిలోగా ఏయే చర్యలు చేపట్టాలో నిర్ణయించుకున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికా ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించింది. మిగితా దేశాలు కూడా రకరకాల కారణాలతో ఒప్పందంలో అంతగా పురోగతి సాధించడం లేదు.

తాజాగా శీతోష్ణస్థితి మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ తన నివేదిక ను విడుదల చేసింది. దీంతో శీతోష్ణస్థితి మార్పుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రపంచంలో కర్బన ఉద్గారాలను అధికంగా వెలువరిస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటి. అదే సమయంలో శీతోష్ణస్థితి మార్పు ప్రభావానికి అమితంగా గురయ్యే దేశాల్లో కూడా మన దేశం కూడా ఉంది. ఉష్ణోగ్రత మరో 2 డిగ్రీలు పెరిగితే ఏం జరుగుతుందనే అంశం ఊహించుకోవడానికే భయమేస్తుంది. భారతదేశం, పాకిస్థాన్ లో వడగాలులు అధికమవుతాయి. మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలిపోతాయి. 2050 నాటికి కొన్ని వందల పట్టణాల్లో కోట్లాది మంది విపరీతమైన ఎండలకు గురవుతారు. దారిద్యం పెరిగిపోతుంది. పంటదిగుబడులు తగ్గిపోతాయి. కరువు కాటకాలు అధికమైపోతాయి.

ఉష్ణోగ్రత మరో 2 డిగ్రీలకు పెరిగే లోగానే, దాన్ని 1.5 డిగ్రీల వద్దనే నిలువరించే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. అలా చేయడంలో విజయం సాధించినా ఎన్నో ప్రయోజనాలుంటాయి. కోట్లాది మంది శీతోష్ణస్థితి మార్పుల ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతారు. వరి, గోధుమ, మక్కజొన్న లాంటి పంట దిగుబడులు భారీ స్థాయిలో తగ్గిపోవడాన్ని నిరోధించవచ్చు. ఉష్ణోగ్రత పెరుగుదలలో ప్రస్తుత రేటు కొనసాగితే 2030 నుంచి 2052 మధ్య కాలంలో గ్లోబల్ టెంపరేచర్ 1.5 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలో అరడిగ్రీ పెరుగుదల అయినా మానవాళిపై పెను ప్రభావాన్ని కనబరుస్తుంది. గత వందేళ్ళ కాలంలో ఢిల్లీలో 1 డిగ్రీ, ముంబైలో 0.7, కోల్ కతా లో 1.2 డిగ్రీల మేరకు, చెన్నైలో 0.6 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రత పెరిగింది. గతంలో ఒక డిగ్రీ పెరుగుదలకు ఒక వందేళ్ళ కాలం పట్టినా....ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. పెరుగుదల రేటు వేగంగా ఉన్న నేపథ్యంలో మూడు, నాలుగు దశాబ్దాల కాలంలోనే ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories