హామీలు సరే... మరి నిధుల మూటేది?

హామీలు సరే... మరి నిధుల మూటేది?
x
Highlights

ఇటు టీఆర్ఎస్, అటు ప్రజాకూటమి హామీల వర్షం కురిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలు రెట్టింపు చేస్తామంటున్నాయి. జనాలు కూడా పార్టీల పథకాలను బేరీజు...

ఇటు టీఆర్ఎస్, అటు ప్రజాకూటమి హామీల వర్షం కురిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలు రెట్టింపు చేస్తామంటున్నాయి. జనాలు కూడా పార్టీల పథకాలను బేరీజు వేసుకుంటున్నారు. పార్టీలు, ప్రజలు బాగానే ఆలోచిస్తున్నారు కానీ, అధికారుల గుండెల్లోనే, రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఆశలు బారెడు....ఆదాయం మూరెడు అన్న సామెత గుర్తుందిగా...ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుండాలన్నదే దాని సారాంశం. కానీ గెలుపే లక్ష్యంగా, జీవన్మరణంగా పోరాడుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు, తమిళనాడు తరహాలో వరాలు ప్రకటిస్తున్నాయి. రాష్ట్ర ఆదాయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, ఇప్పటికి గట్టెక్కితే చాలన్నట్టుగా మేనిఫెస్టోలతో, జనాలకు వలేస్తున్నాయి. కానీ చిట్టాపద్దులు పక్కాగా చూసుకునే అధికారులకు మాత్రం, ఈ హామీలు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర్రం ఏర్పడిన తర్వాత ఐదుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 1,74,453 కోట్ల భారీ బడ్జెట్‌ పెట్టారు. రెవెన్యూ వ్యయం లక్షా 25వేల 454కోట్లు కాగా, క్యాపిటల్‌ వ్యయం 33వేల 369 కోట్లు. ఇక రాష్ట్ర ఆదాయం 73వేల 751కోట్లుగా టార్గెట్ పెట్టుకున్నారు. మరోవైపు కేంద్రం నుంచి వచ్చే ఆదాయం 29వేల 41కోట్లని అంచనా వేశారు. రాష్ట్ర జీడిపి పెరుగుతుందని, ఈ ఏడాది వృద్ది రేటు 10.4 ఉంటుందని అంచనా కట్టారు.

ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తి కాకముందే, ఎన్నికలు రావడంతో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ పథకాలతో పాటు, కొత్త పథకాలు ప్రారంభిస్తామని అటు టిఆర్ఎస్, ఇటు మహకుటామి నేతలు హమీలు ఇస్తున్నారు. వ్యవసాయం, విద్యుత్, విద్యా,వైద్యం వంటి రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అంటున్నారు. ప్రధానంగా సంక్షేమంపై మరింత బడ్జెట్‌ కేటాయిస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రస్తుత హామీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సిందే. వీటికయ్యే మొత్తం ఖర్చెంతో, ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నారు ఆర్థిక శాఖ అధికారులు.

లక్షలోపు పంట రుణాల హామీనిచ్చింది టీఆర్ఎస్. ఇక ప్రజాకూటమి అయితే, రెండు లక్షలంటోంది. అంటే కేవలం రైతుల రుణమాఫీ కోసమే 25 వేల కోట్లు అవసరమవుతాయని, అధికారుల అంచనా. దీంతో బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడకతప్పదని అంటున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఆసరా పెన్షన్లు రెట్టింపవుతాయి. ప్రస్తతం 5,600 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రెట్టింపయితే, 11,200 కోట్లు అవసరం పడతాయి. ఇక కొత్తగా రాష్ట్ర్రంలో నిరుద్యోగభృతి ఇచ్చేందుకు, సిద్దమంటున్నాయి పార్టీలు. నిరుద్యోగభృతికి మరో 4 వేల కోట్లు కావాలి. మహిళా గ్రూపులకు లక్ష చొప్పున చెల్లిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. టీఆర్ఎస్‌ కూడా వరాలు కురిపించింది. ఇందుకు గాను 4 వేల కోట్ల అదనపు నిధులు అవసరం. దీంతోపాటు విద్యా, వైద్యం,ఉపాది, ఇతర మౌలిక వసతులకోసం వెచ్చించే బడ్జెట్ రెట్టింపు కానుంది. ఎటు చూసినా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర బడ్జెట్‌కు అదనంగా 60 వేల కోట్లు సమకుర్చుకోవాల్సి ఉంటుందని అధికారుల అంచనా. మరి ఈస్థాయిలో పెరిగిపోయే బడ్జెట్‌కు, డబ్బులు ఎక్కడి నుంచి పాలకులు తెస్తారన్నదే అసలు ప్రశ్న.

డిసెంబర్ 11 తర్వాత ఏర్పడే ఏ ప్రభుత్వమైనా, వెంటనే చెప్పిన పథకాలన్నీ పట్టాలెక్కించాలి. ఎందుకంటే, వెనువెంటనే పార్లమెంట్‌ ఎన్నికలు తరుముకొస్తాయి. లేదంటే లోక్‌సభ పోరులో ఇబ్బందులు తప్పవు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు హామీల అమలుకు, సంబంధిత శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌, మహా కూటమి కొత్త హామీలను నెరవేర్చడానికి ఏ మేరకు నిధులు అవసరం అనేదానిపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి, ఒక అంచనాకు రావాలని ఆర్థిక శాఖ అధికారులకు సీఎస్‌ సూచించినట్లు సచివాలయం అధికారులు చెప్తున్నారు. అయితే, గెలుపు కోసం ఆకర్షణీయ పథకాల పాట పాడుతున్న రాజకీయ పార్టీలు, రాష్ట్ర ఆదాయ-వ్యయాలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇన్ని పథకాల అమలుకు, కొత్త ఆదాయ మార్గాలనూ చెప్పడం లేదు. ఇవన్నీ అమలు చేయాలంటే, రాష్ట్రాన్ని మరింతగా అప్పుల్లోకి నెట్టేయాల్సిందే. జనాలకే పథకాలిచ్చి, చివరికి జనం నెత్తినే అప్పు-వడ్డీ భారాన్ని మోపేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories