గుడ్ బై కి ముందు పార్టీకి నాగం డెడ్ లైన్

x
Highlights

తెలుగు రాజకీయాల్లో సీనియర్ నేతల్లో ఒకరైన నాగం జనార్దన్ రెడ్డి.. తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. అయితే ఆయన అసంతృప్తి.. తాను ఇప్పుడున్న బీజేపీ మీదే కావడం...

తెలుగు రాజకీయాల్లో సీనియర్ నేతల్లో ఒకరైన నాగం జనార్దన్ రెడ్డి.. తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. అయితే ఆయన అసంతృప్తి.. తాను ఇప్పుడున్న బీజేపీ మీదే కావడం విశేషం. తెలంగాణ ఏర్పాటుకు ముందే బీజేపీలో చేరిన నాగం.. ఆ పార్టీలో మొదట్నుంచీ అవమానాలే ఎదుర్కొంటున్నారు. ఇక వివిధ పార్టీల నాయకులంతా పోటాపోటీగా భవిష్యత్ రాజకీయాల మీద దృష్టి సారించడంతో.. నాగం కూడా తన దారి మార్చుకునే విషయంలో తీవ్రంగా ఆలోచిస్తూండడం.. కమలనాథుల్లో కలవరం రేపుతోంది.

బీజేపీ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి.. కొంతకాలంగా తన అనుచరులతో, నియోజకవర్గ కార్యకర్తలతో.. రాజకీయ భవిష్యత్తుపై తీవ్రస్థాయిలో సమాలోచనలు జరుపుతున్నారు. రాజకీయ నిర్ణయం ఆలస్యమైతే జరిగే నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుందని.. అందుకే ఇక ఉపేక్షించకుండా ఏదో నిర్ణయం తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నట్లు నాగం హెచ్ఎంటీవీకి వెల్లడించడం విశేషం. ఉమ్మడి ఏపీలోనే కీలకమైన నాయకుల్లో ఒకడిగా, చంద్రబాబు హయాంలో నెంబర్ టూ గా ఎదిగిన నాగం.. బీజేపీ లో మాత్రం తనకు కనీస గుర్తింపు లేదని తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా టికెట్ ఇచ్చినా.. కొందరు సీనియర్ల వైఖరితో తనను పార్టీలో అణగదొక్కారన్నారు.

మహబూబ్ నగర్లో బీజేపీ ఎంపీలు, ముఖ్యనేతల సమావేశం నిర్వహించినప్పుడు.. కనీసం తన ఫొటో కూడా ఫ్లెక్సీల్లో పెట్టలేదని.. ముఖ్యనేతల్లో తన పట్ల ఎంత వ్యతిరేక భావన ఉందో దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చంటున్నారు.. నాగం. గత ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పుడు తెరవెనుక ఎవరేం చేశారో వివరిస్తూ అధిష్టానానికి లేఖ కూడా రాశానని నాగం చెప్పడం బీజేపీలో కలవరం రేపుతోంది.

తెలంగాణ సర్కారులో విపరీతమైన అవినీతి పేరుకుపోయందని.. దాని మీద తాను పోరాడుతుంటే.. బీజేపీ నాయకులు చిన్నచిన్న లాభాల కోసం టీఆర్ఎస్ నేతలతో చెట్టపట్టాలు వేసుకుంటున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా.. తెలంగాణ సర్కారు అవినీతి మీద విచారించడం లేదనని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను పంపిస్తే అవినీతి బండారం బయట పడుతుందన్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోయి.. మూతపడే దశలో ఉన్న ఇండియా బుల్స్ అనే కంపెనీకి రుణాలు ఇప్పించి, పవర్ ప్లాంట్ కట్టబెట్టడంలో కేసీఆర్ సర్కారు అవినీతి కళ్లకు కడుతోందని.. అయినా బీజేపీ నాయకులు దాని మీద మాట్లాడటం లేదని.. సొంత పార్టీ నాయకుల పైనే నాగం ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన పట్ల కొందరు బీజేపీ సీనియర్ల వైఖరి ఎలా ఉన్నా.. టీఆర్ఎస్ ను మాత్రం అధికారంలోకి రానిచ్చే పరిస్థితే లేదని.. కచ్చితంగా దాన్ని అడ్డుకుంటామంటున్నారు.. నాగం. అవినీతి, కుటుంబ పాలన వంటి అనేక అవలక్షణాలు టీఆర్ఎస్ ను పీడిస్తున్నాయన్నారు. పవర్లోకి వచ్చిన కొత్తలో పేద ప్రజలందరూ ఆత్మగౌరవంతో ఉండేలా.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తాన్న కేసీఆర్... ఆ తరువాత తెలివిగా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.

రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందే రాజకీయ నిర్ణయం కోసం నాగం పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నా.. ఇటీవలి కాలంలో అనుచరులతో నాగం భేటీ అవుతున్న క్రమంలో.. అధిష్టానం మళ్లీ ఆయన్ని బుజ్జగించడం విశేషం. ఇతర పార్టీల నేతలు బీజేపీలోకి వస్తున్నారంటూ కమలనాథులు ఊదరగొడుతున్న క్రమంలో.. నాగం లాంటి సీనియర్లే పార్టీని వీడితే దెబ్బ తింటుందన్న ఆందోళన ఆ పార్టీ సీనియర్లలో వ్యక్తమవుతోంది. అయితే ఉగాది వరకు వేచి చూసి.. తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని నాగం ప్రకటించడం కొసమెరుపు.

Show Full Article
Print Article
Next Story
More Stories