తెలంగాణలో మావోయిస్టుల కలకలం...పలువురు ప్రజాప్రతినిధులకు బహిరంగ లేఖలు

Submitted by arun on Fri, 11/09/2018 - 10:35
mao

తెలంగాణలో విధ్వంసానికి మావోయిస్టులు కుట్ర చేస్తున్నారా ?  ఎన్నికళ వేళ హింసాత్మక ఘటనలకు పాల్పడటం ద్వారా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారా ? ఎన్నికలను బహిష్కరించాలంటూ మండల కేంద్రాల్లో సైతం ప్రచారం చేయడం ద్వారా మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసురుతున్నారా ?  ఏపీ తరహాలోనే ప్రజా ప్రతినిధులను టార్గెట్‌ చేసుకున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవమెంత ..?  

ఎన్నికల వేళ తెలంగాణలో మావోయిస్టులు ఉనికి చాటుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూనే  మరో వైపు ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.  రెండు రోజుల క్రితం ఎన్నికలు బహిష్కరించాలంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల పోస్టర్లు విడుదల చేసిన మావోయిస్టులు తాజాగా కొందరు ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తూ లేఖలు విడుదల చేయడం పోలీసులకు సవాల్‌గా మారింది.  

గోదావరి పరివాహక ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు ఊపందుకుంటున్నట్టు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఇదే సమయంలో ఏపీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలు హత్య కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో తమ కార్యకలాపాలు తాత్కాలికంగా ఆపేసిన మావోయిస్టులు  తాజాగా మళ్లీ తమ కార్యకలాపాలు చేపట్టారు. వాజేడు వెంకటాపురం, భద్రాచలం పరిసరాలతో పాటు భూపాలపల్లి, మంథనిలో డివిజన్‌ కమిటీల కార్యకలాపాలను విస్తృతం చేసినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో త్వరలోనే మొదటి దఫా ఎన్నికల పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన నాటి నుంచి నిత్యం ఎక్కడో ఒకచోట హింసాత్మక ఘటనలకు పాల్పడటం ద్వారా మావోయిస్టులు తమ ఆధిపత్యాన్ని  ప్రదర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే తెలంగాణలో కూడా దాడులకు పాల్పడే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు. 
  
గ్రామాలు, మండల కేంద్రాల్లోకి వచ్చి పోస్టర్లు అంటించడం, ప్రజలకు, నేతలకు వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. స్ధానికుల సహకారంతోనే మావోయిస్టులు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని భావిస్తున్న పోలీసులు ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే లేఖలో ప్రస్తావించిన అంశాలు మావోయిస్టు భావజాలానికి అనుగుణంగా లేవంటూ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఎన్నికలను బహిష్కరించాలని చెబుతూనే  పార్టీల పేరుతో విమర్శలు చేయడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. పరిస్ధితులు ఎలా ఉన్నా తాము మాత్రం అప్రమత్తంగానే ఉన్నామంటూ ఉమ్మడి జిల్లా పోలీసులు, ఉన్నతాధికారులు చెబుతున్నారు. లేఖల వెనక ఉన్నదెవరో త్వరలోనే గుర్తిస్తామన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేయడం చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజా ఘటనలపై మూడు బృందాలను ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు  సీసీ కెమెరాలు, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. 

English Title
telangana moist

MORE FROM AUTHOR

RELATED ARTICLES