మరో కీలక నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ ప్రభుత్వం

Submitted by arun on Mon, 02/12/2018 - 11:06
kcr

తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే మరో ఆర్డినెన్స్ తీసుకురాబోతుంది. ఈసారి కబ్జాకు గురైన అసైన్డ్ భూములను రీ అసైన్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. మార్చిలో మొదలయ్యే బడ్జెట్‌ సమావేశాల్లోగా ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అసైన్డ్‌ భూములు అసలు లబ్ధిదారులకు బదులుగా ఇతరుల చేతిలో ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అసైన్డ్ భూములకు సంబంధించి తెలంగాణ సర్కార్ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్రంలో కబ్జాలకు గురైన అసైన్డ్ భూములను రీ అసైన్ చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణలో మొత్తం 22 లక్షల 63 వేల ఎకరాల అసైన్డ్‌ భూములున్నాయి. ప్రతి గ్రామంలో దాదాపు 60 శాతానికి పైగా అసైన్డ్‌ భూములు ఆక్రమణలకు గురైనట్లు ఇటీవల చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనతో రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 84 వేల 706 మంది ఆక్రమణదారుల లిస్ట్‌ను సర్కార్ రెడీ చేసింది. ఇప్పటివరకు ఉన్న నిబంధన ప్రకారం 2007 జనవరి 29 నాటికి ఆక్రమణలో ఉన్నవారికే ప్రయోజనం చేకూరుతుంది. ఈ కటాఫ్‌ తేదీని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014 జూన్‌ 2 నాటికి అసైన్డ్‌ భూములు ఎవరి పేరిట ఉన్నాయో గుర్తించి వారి పేరిట రీ అసైన్‌ చేస్తారు. అందుకనుగుణంగా తెలంగాణ అసైన్డ్‌ ల్యాండ్స్‌ యాక్ట్‌లో కొన్ని నిబంధనల్ని తప్పనిసరిగా సవరించాల్సి ఉంటుంది. అందుకే ఆర్డినెన్స్‌ జారీ చేయనున్నారు. మార్చి 12 కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీంతో ఆర్డినెన్స్‌కు అధికార యంత్రాంగం రూపకల్పన చేస్తోంది. 

మార్చిలో మొదలయ్యే బడ్జెట్‌ సమావేశాల్లోగా ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అసైన్డ్‌ భూములు అసలు లబ్ధిదారులకు బదులుగా ఇతరుల చేతిలో ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవాలని.. నిరుపేద వర్గాల చేతుల్లో ఉంటే క్రమబద్ధీకరించాలని సర్కార్ నిర్ణయించింది. పనిలో పనిగా రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేసేందుకు మరో ఆర్డినెన్స్‌ తీసుకురానుంది ప్రభుత్వం. ప్రస్తుతం ఈ రెండు ప్రతిపాదనలు న్యాయ శాఖ పరిశీలనలో ఉన్నాయి.

English Title
telangana govt Planning to re-assign the assigned land

MORE FROM AUTHOR

RELATED ARTICLES