ఎగ్జిట్ పోల్స్‌ నిజమవుతాయా...తెలంగాణ ఎన్నికల సర్వేల్లో వేటిని నమ్మాలి

ఎగ్జిట్ పోల్స్‌ నిజమవుతాయా...తెలంగాణ ఎన్నికల సర్వేల్లో వేటిని నమ్మాలి
x
Highlights

ఎగ్జిట్ పోల్స్...ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిశాక వెల్లడయిన సర్వే ఫలితాలు అందర్లోనూ ఆసక్తిని ఉత్కంఠనూ మరింత...

ఎగ్జిట్ పోల్స్...ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిశాక వెల్లడయిన సర్వే ఫలితాలు అందర్లోనూ ఆసక్తిని ఉత్కంఠనూ మరింత పెంచాయి. అయితే సర్వేల్లో కచ్చితత్వం ఎంత..? ఎగ్జిట్‌ పోల్స్‌‌లో ఫలితాలు ఎంత వరకు నిజమౌతాయి..? అసలు ఏ ఎగ్జిట్ పోల్‌ ను నమ్మాలి...? ఇప్పుడు ప్రజల్లో ఇదే అయోమయం నెలకొంది.

ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల క్రతువు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపైనే ఉంది. అయితే తెలంగాణ ఎన్నికలు ముగిసిన వెంటనే విడుదలైన ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌‌పై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్ సర్వే ఫలితాలు ఎలా ఉన్నా తెలంగాణ విషయంలో మాత్రం జాతీయ ఛానళ్ళ సర్వే అంచనాలకు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వేకు పూర్తి భిన్నంగా ఉండటం తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి జాతీయ చానల్స్‌ చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌ టీఆర్‌ఎస్‌కు మెజారిటీ ఇస్తే లగడపాటికి చెందిన ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌ చేసిన సర్వేలో ప్రజా ఫ్రంట్‌కు ఆధిక్యం వచ్చింది. దీంతో ఈ సర్వేల్లో నిజమెంత గత సర్వేలు ఎంతవరకూ నిజమయ్యాయి? వీటిలో ఏ సంస్థలు ఫలితాలను కచ్చితంగా అంచనా వేయగలిగాయన్నది మరోసారి చర్చనీయాంశమైంది. 2013లో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ ఎన్నికల సమయంలోనూ ఈ ఏడాది కర్ణాటక శాసనసభ ఎన్నికలప్పుడూ పలు సంస్థలు అంచనాలను విడుదల చేశాయి. వీటిలో కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు చాలా దగ్గరగా ఉండటం విశేషం.

2013లో మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై దాదాపు ఆరు జాతీయ ఛానళ్ళు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిచగా అవన్నీ గెలుపు బీజేపీదే అని తేల్చేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాల కంటే బీజేపీ ఎక్కువ సీట్లనే సాధించింది. 2013లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలపై ఆరు జాతీయ ఛానళ్ళు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించగా ఆ సంస్థలన్నీ గెలుపు బీజేపీదేనని స్పష్టం చేశాయి. చెప్పినట్లుగానే 2013లో రాజస్థాన్‌లో బీజేపీనే జయకేతనం ఎగరేసింది. ఇక 2013లో ఛత్తీస్ గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఆరు జాతీయ ఛానళ్ళు ఎగ్జిట్ పోల్ సర్వేలు చేశాయి. అయితే మూడు సంస్థల సర్వేలు మాత్రం ఫలితాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. అలాగే 2017 నాటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఆరు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించగా అన్ని సంస్థలూ బీజేపీ విజయఢంకా మొగిస్తుందని అంచనా వేశాయి. కానీ అనూహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ పోటీ నెలకొని చివరికి కమలదళం కొద్దిపాటి మెజార్టీతో బయటపడింది. మొన్నటి కర్ణాటక ఎన్నికల్లోనూ మొత్తం 9 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించగా మూడు ఛానళ్ళ సర్వేలు మాత్రమే ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి.

తెలంగాణ ఎన్నికలపై ఇప్పుడు లగడపాటి చేసిన సర్వేనే అందర్లోనూ ఆసక్తి రేపుతోంది. గతంలో ఆయన చేసిన సర్వేలు నిజం కావడంతో ఆయనకు ఆంధ్రా ఆక్టోపస్ అని గుర్తింపు కూడా వచ్చింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 60 సీట్లకు అటు ఇటుగా వస్తాయని లగడపాటి చెప్పగా టీఆర్ఎస్‌కు 63 స్థానాలు వచ్చాయి. అలాగే 2014లో ఏపీలో టీడీపీ-బీజేపీ కూటమికి 115 నుంచి 125 అసెంబ్లీ స్థానాలు వస్తాయని లగడపాటి సర్వే అంచనా వేసింది. అప్పుడు టీడీపీ-బీజేపీ కూటమికి 106 సీట్లు వచ్చాయి. గతేడాది నంధ్యాల ఉపఎన్నిక సమయంలోనూ టీడీపీ విజయం సాధిస్తుందని లగడపాటి జోస్యం చెప్పగా అదే జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలపై లగడపాటి నేతృత్వంలోని ఆర్జీ ఫ్లాష్ టీం చేసిన ఎగ్జిట్ పోల్స్ లెక్క నిజమవుతుందా లేదా అనే ఆసక్తి నెలకొంది. మరి తెలంగాణ ఎన్నికలపై జాతీయ సర్వేలు నిజమౌతాయా లేదంటే ఆంధ్రా ఆక్టోపస్ అంచనాలు నిజమౌతాయో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories