65 స్థానాల్లో ఓకే

65 స్థానాల్లో ఓకే
x
Highlights

డిసెంబరులోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు...

డిసెంబరులోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని చెప్పారు. ఇప్పటికే ఎన్నికల కసరత్తు ప్రారంభించినట్టు ఉత్తమ్ తెలిపారు. 60–65 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చిందని.. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 70 స్థానాల్లో గెలవడం ఖాయమని ధీమాగా చెబుతున్నారు.

ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తే ఈ డిసెంబర్ లోనే ఎన్నికలు జరిగేలా కనిపిస్తున్నాయని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ 70 స్థానాలకు పైగా గెలుస్తుందన్నారు. దక్షిణ తెలంగాణలో అన్ని సీట్లను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుందని ఉత్తమ్‌ ధీమా వ్యక్తంచేశారు. అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు.

నియోజకవర్గాల పునర్విభజన ఫైలుపై ప్రధాని మోడీ సంతకం పెట్టినట్టు తనకు సమాచారం ఉందని చెబుతున్న ఉత్తమ్‌కుమార్‌.. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పార్లమెంట్‌కు 2 స్థానాలు పెరగొచ్చని అన్నారు. దీని గురించి రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా తెలిసి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

అధికార టీఆర్ఎస్ ను ఓడించాలంటే ప్రజలతో మమేకం కావడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ నిర్ణయించింది. అందుకోసం బడ్జెట్ సమావేశాల తర్వాత ఫిబ్రవరి మూడో వారంలో బస్సు యాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు ఉత్తమ్‌. 119 నియోజకవర్గాలను చుట్టే బస్సు యాత్ర జూన్‌ 2న భారీ బహిరంగ సభతో ముగుస్తుంది.

బస్సు యాత్రలో ఎవరెవరు పాల్గొనాలన్న విషయమై ఢిల్లీ పెద్దల నుంచి త్వరలో సమాచారం వస్తుందని పార్టీ సీనియర్లు అంటున్నారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఏకాభిప్రాయం కుదిరిన 65 నియోజకవర్గ ఇంచార్జ్ లను ముందుగా ప్రకటించనున్నారు. బడ్జెట్‌ సమావేశాల తరువాత మరోసారి తెలంగాణాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ సభ ఏర్పాటు చేస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories