కేసీఆర్‌ ప్రభుత్వ పతనం ప్రారంభమైంది

Submitted by arun on Tue, 04/17/2018 - 15:43
kcr


తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై విధించిన అసెంబ్లీ బహిష్కరణ ఉన్నత న్యాయస్థానం ఎత్తివేసింది. వారి శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీచేసింది. వారు తప్పు చేశారని భావిస్తే ప్రభుత్వం  క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు గానీ.. అసెంబ్లీ బహిష్కరణ సరికాదని న్యాయస్థానం పేర్కొంది. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు సభలో ఆందోళన చేశారు. గవర్నర్‌ ప్రసంగం ప్రతులను చించివేశారు. అదే సమయంలో కోమటిరెడ్డి వెంటకరెడ్డి హెడ్‌ఫోన్‌ను విసరగా అది శాసన మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి తగిలినట్లు ఆరోపణలు వచ్చాయి. గవర్నర్‌ ప్రసంగం ముగిసిన వెంటనే స్వామిగౌడ్‌ సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి వెళ్ళి చికిత్స తీసుకున్నారు. 

ఈ ఘటనలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించారంటూ వారిపై అసెంబ్లీ బహిష్కరణ విధించారు. ఆ వెంటనే వారి శాసన సభ్యత్వాలు రద్దయినట్లు ప్రభుత్వం జీవో జారీచేసింది. ఆ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలంటూ ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది. దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. తమను అసెంబ్లీ నుంచి బహిష్కరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని కోర్టుకు విన్నవించారు. దీనిపై పలుమార్లు వాదనలు విన్న న్యాయస్థానం కాంగ్రెస్‌ సభ్యులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం జారీచేసిన జీవోలన్నీ రద్దయినట్లేనని కాంగ్రెస్‌ సభ్యుల తరపు వాదనలు వినిపించిన న్యాయవాది పేర్కొన్నారు.

హైకోర్టు తీర్పు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నెలరోజులుగా తనను చాలా ఇబ్బందిపెట్టారని, మానసికంగా హింసిస్తున్నారని మండిపడ్డారు. తన అనుచరుడిని చేంపేశారని ఆవేదన వ్యక్తం చేసిన కోమటిరెడ్డి....100 మంది కేసీఆర్‌లు వచ్చినా తనను ఏమీ చేయలేరన్నారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌ల పదవీ బహిష్కరణ కేసు కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువడటం హర్షణీయమన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఇది  టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు. అప్రజాస్వామిక చర్యలతో ప్రశ్నించే గొంతులు నొక్కేయాలని చూస్తున్న కేసీఆర్ ప్రభుత్వ పతనం మొదలైందని, ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని ఆయన చెప్పారు. కేసీఆర్ సర్కార్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన సాగించాలని సూచించారు ఉత్తమ్. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిగ్గుపడే విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ. తెలంగాణ ముఖ్యమంత్రికి ఏ మాత్రం సిగ్గున్నా తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ సర్కారు ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తోందని, అసెంబ్లీలో తమకు ఇష్టం ఉన్న వారినే లోపలికి రానిస్తామనేలా వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో హైకోర్టు మొట్టికాయలు కొట్టిందని, అయినప్పటికీ ఆయన తీరు మారడం లేదని ఆమె అన్నారు.  

English Title
telangana congress leaders fire cm kcr

MORE FROM AUTHOR

RELATED ARTICLES