సిద్దూ వ్యాఖ్యలపై మండిపడ్డ టీకాంగ్రెస్‌

సిద్దూ వ్యాఖ్యలపై మండిపడ్డ టీకాంగ్రెస్‌
x
Highlights

కాంగ్రెస్ పాలిత రాష్ట్ర మంత్రులు తమ వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్‌ను క్లీన్ బోల్డ్ చేస్తున్నారు. మొన్నటి వరకు కేంద్ర మంత్రులు TRSకు ప్రచారం...

కాంగ్రెస్ పాలిత రాష్ట్ర మంత్రులు తమ వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్‌ను క్లీన్ బోల్డ్ చేస్తున్నారు. మొన్నటి వరకు కేంద్ర మంత్రులు TRSకు ప్రచారం చేస్తే..ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కేసీఆర్ సర్కార్‌కు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాయి. కేంద్ర మంత్రులు రాష్ట్ర బీజేపీకి తలనొప్పి తెప్పిస్తే ఇప్పుడు అదే సమస్య గాంధీ భవన్‌కి ఎదురవుతోంది. పంజాబ్ మంత్రి సిద్ధూ వ్యాఖ్యలు హస్తం పార్టీ నేతలకు మంట పుట్టిస్తున్నాయి.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మంత్రులు తెలంగాణ కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారారు. ఒకవైపు ప్రభుత్వ విధానాలపై ఇక్కడ కాంగ్రెస్ పోరాడుతుంటే.. వేరే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు వచ్చి ఇక్కడి పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు తుస్సుమనేలా చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ చేస్తున్న గొర్రెల పంపిణీలో అవినీతి జరుగుతుందని టీకాంగ్రెస్ విమర్శిస్తుంటే.. కర్ణాటక మంత్రి రేవన్న మాత్రం ఇది దేశంలోనే మంచి పాలసీ అని కితాబిచ్చారు. అది మరువకుండానే పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి.

కేసిఆర్ సర్కార్ తీసుకొచ్చిన ఇసుక పాలసీపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శలు కురిపిస్తూ పోరాటం చేశారు. పార్లమెంటు మాజీ స్పీకర్ మీరా కుమార్‌ని సిరిసిల్ల తీసుకొచ్చి ఇసుక మాఫియాపై ఆందోళన చేశారు. నేరేళ్ల ఘటనను జాతీయస్థాయికి తీసుకెళ్లారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇంతగా ఇసుక అక్రమాలపై పోరాటం చేస్తే.. పంజాబ్ మంత్రి సిద్ధూ మాత్రం ఇక్కడ ఇసుక పాలసీ అద్భుతంగా ఉందని.. దేశంలోనే ఇది నెంబర్ 1 పాలసీ అని కితాబివ్వడం తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది.

నవజోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఆయన అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని..ఇసుక తవ్వకాలలో జరుగుతున్న అక్రమాలు, పర్యావరణానికి జరుగుతున్న నష్టం గురించి తెలియకుండా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇక్కడి నేతలని సంప్రదించకుండా కామెంట్స్ చేయడం సరికాదని హితవు పలికారు. సిద్ధూ మరోసారి వస్తే నేరెళ్ల గ్రామానికి తీసుకెళ్లి ఇసుక మాఫియా బాధిత కుటుంబాలను చూపిస్తామని చెబుతున్నారు.

సిద్ధూ కామెంట్స్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇకపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మంత్రులు రాష్ట్రానికి వస్తే ముందు తమను సంప్రదించి ప్రభుత్వ విధానాలపై వ్యాఖ్యలు చేసే విధంగా హైకమాండ్ చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories