ఢిల్లీకి కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా...దాదాపు 70 స్థానాల్లో ఒకే వ్యక్తి పేరు ఖరారు

x
Highlights

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఢిల్లీకి చేరింది. మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించిన భక్తచరణ్‌దాస్‌ నేతృత్వంలోని...

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఢిల్లీకి చేరింది. మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించిన భక్తచరణ్‌దాస్‌ నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ బృందం హస్తిన వెళ్లింది. ఈ నెల 10 నుంచి 12 వరకు హైదరాబాద్‌లోనే మకాం వేసిన త్రిసభ్య స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు వందల మందితో జరిపిన చర్చలు, తమ వద్ద ఉన్న సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కీలక ఘట్టాన్ని పూర్తి చేశారు. తమకు వచ్చిన అంచనా మేరకు ఏ స్థానానికి ఏ అభ్యర్థి గెలుపుగుర్రమో నిర్ధారించిన జాబితాతో ఈ బృందం ఢిల్లీకి వెళ్లింది.

అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్‌ కమిటీ చర్చోపచర్చలు జరిపింది. చైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌తోపాటు సభ్యులు శర్మిష్ట ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలైలు మూడు రోజులపాటు చర్చలు జరిపారు. మొదటి రోజున పార్టీ ఎన్నికల కమిటీతో చర్చించి వ్యక్తిగతంగా నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. రెండోరోజు గాంధీ భవన్‌లో డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధి బృందాలు, టీపీసీసీ ముఖ్య నేతలు, కొందరు ఆశావహులతో సమావేశమయ్యారు. మూడో రోజు తాము బస చేసిన హోటల్‌లోనే టీపీసీసీ ముఖ్య నేతలతో సమావేశమై అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరిపారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ముఖ్య నేతలు జానారెడ్డి, జైపాల్‌రెడ్డి, డి.కె.అరుణ, రేవంత్‌రెడ్డి తదితరులతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. అనంతరం అందరి అభిప్రాయాలను వడపోసి ఎన్నికల కమిటీ సూచించిన పేర్ల నుంచి సరైన అభ్యర్థులతో జాబితాను రూపొందించినట్లు తెలిసింది. ఈ జాబితాలో దాదాపు 70 వరకు స్థానాల్లో ఒకే వ్యక్తి పేరు సూచించారని తెలుస్తోంది. మిగిలిన చోట్ల ఇద్దరు, గరిష్టంగా ముగ్గురు పేర్లను మాత్రమే జత చేసినట్టు తెలుస్తోంది. చివరి నిమిషంలో అభ్యర్థుల జాబితాలో కొన్ని మార్పుచేర్పులు చేసినట్లు గాంధీ భవన్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాను పార్టీ సీనియర్‌ నేత ఎ.కె.ఆంటోని నేతృత్వంలోని ఏఐసీసీ ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్‌ కమిటీ అందజేయనుంది. రేపు జరిగే సమావేశంలో ఏఐసీసీ ఎన్నికల కమిటీ చర్చించి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతోపాటు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి జాబితాను అందిస్తారు. ఈలోపు స్క్రీనింగ్‌ కమిటీ రాహుల్‌తో సమావేశం కానుంది. ఈ నెల 20న రాష్ట్రంలో రాహుల్‌ పర్యటన ముగిసిన మర్నాడే స్క్రీనింగ్‌ కమిటీ మరోసారి హైదరాబాద్‌ వచ్చి ఎన్నికల కమిటీతో మళ్లీ సమావేశం కానుంది. నవంబర్‌లోనే పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.

కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితా తయారీతోపాటు పొత్తు పెట్టుకునే ఇతర పార్టీలకు కూడా ఏయే సీట్లు కేటాయించాలనే అంశంపైనా స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ, సీపీఐ, జనసమితి ఎక్కడెక్కడ పోటీ చేస్తే బాగుంటుదనే దానిపై కూడా టీపీసీసీ ముఖ్య నేతల నుంచి కమిటీ అభిప్రాయాలు సేకరించింది. పాతబస్తీలో ఎంఐఎంకు దీటుగా ఎంబీటీతో కలసి వెళ్లాలనే దాని పై కూడా స్క్రీనింగ్‌ కమిటీ వద్ద కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. చాంద్రాయణగుట్ట స్థానం నుంచి అక్బరుద్దీన్‌ ఒవైసీకి పోటీగా ఎంఐఎం రాజకీయ ప్రత్యర్థి మహ్మద్‌ పహిల్వాన్‌ లేదా ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరిని బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంమీద పాతబస్తీలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎంబీటీతో కలసి వెళ్లడమే మంచిదనే అభిప్రాయంతో కాంగ్రెస్‌ వర్గాలున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories