వెనక్కి తగ్గిన మమతా బెనర్జి, హేమంత్ సోరెన్

Submitted by arun on Thu, 03/08/2018 - 11:39
kcr

ఫెడరల్ ఫ్రంట్‌కు రూపం ఇచ్చేందుకు దేశ వ్యాప్త పర్యటకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియగానే కనీసం 15 రాష్టాలను చుట్టివచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందుకోసం పార్టీ సీనియర్లు, మంత్రులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే కేటీఆర్ కాకుండా మరో పవర్ సెంటర్ రాష్ట్రంలో ఉండకూడదన్న ఉద్దేశంతోనే సమన్వయ కమిటీ పేర సీనియర్లను తనతో తీసుకెళుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. 

మూడో కూటమి ఏర్పాటు దిశలో కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. మూడో కూటమికి తానే నేతృత్వం వహిస్తానని ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్.. కలిసి వచ్చే పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. యూపీఏ, ఎన్డీయేఏతర పక్షాలతో ఫోన్లలో సంప్రదింపులు జరిపారు.. అయితే మమతా బెనర్జీ, హెమంత్ సోరెన్ వంటి నేతలు మద్దతిచ్చినట్టే ఇచ్చి వెనక్కు తగ్గారు. కాంగ్రెస్ లేని కూటమితో బీజేపీని ఓడించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. దీంతో ప్రాంతీయ పార్టీ నేతలను స్వయంగా కలిసి వారి మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు. అందుకోసం దేశవ్యాప్తంగా పర్యటించాలనినిర్ణయించారు. 

ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌కు ఇతర రాష్టాల్లోని అధికార పార్టీలతో మంచి సంబంధాలున్నాయి. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని కోరుతూ 36 పార్టీల మద్దతు కూడగట్టగలిగారు. దీంతో ఆయా పార్టీల అధినేతలతో సన్నిహిత సంబంధాలు ఏర్పాడ్డాయి. వాటిని తిరగదోడి తన ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు సాధించాలనే పట్టుదలతో  ఉన్న కేసీఆర్ త్వరలో 15 రాష్టాల్లోనే పర్యటించాలని నిర్ణయించారు. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియ గానే ఢిల్లీ వెళ్లాలని భావిస్తున్నారు. అక్కడ జాతీయ నేతలతో ఫ్రంట్ విధి విధానాలను చర్చించనునట్లు టీఆర్‌ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అనంతరం బెంగాల్, ఒడిషా, ఢిల్లీ ముఖ్యమంత్రులు... పంజాబ్, జార్ఘండ్, చత్తీస్‌ఘడ్, జమ్ము కాశ్మీర్, మహారాష్ట, కర్ణాటక, బీహార్, హర్యానా మాజీ ముఖ్యమంత్రులతో చర్చించాలని భావిస్తున్నారు. అదే సందర్భంలో కాంగ్రెస్, బీజేపీ కూటముల్లో లేని ఇతర ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరపాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రాల పర్యటన ఏర్పాటు, ఫెడరల్ ఫ్రంట్ విది విధానాల పర్యవేక్షణ కోసం పార్టీ సీనియర్లు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆయా రాష్టాలకు కేసీఆర్ వెళ్లే ముందే ఎవరెవరితో మాట్లాడాలి, ఏ ఏ అంశాలపై చర్చించాలి అన్న విషయాలు మొదలుకుని ఫెడరల్ ఫ్రంట్ ఎజెండాలో ఆ రాష్ట్రానికి చెందిన ఏ అంశాలను చేర్చాలో అన్ని వివరాలను ఈ సమన్వయ కమిటీ రూపొందించనుంది. అందుకోసం జాతీయ రాజకీయాల్లో అనుభవం ఉన్న కేకే వంటి సీనియర్లు ఈ సమన్వయ కమిటీలో కీలక పాత్ర పోషించనున్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆలోచనలను పకడ్బందిగా ఆచరణలో పెట్టిన మంత్రులు హరీష్ రావు, ఈటల వంటి నేతలు కూడా ప్రధాన్యత కల్పిస్తారని సమాచారం. కాంగ్రెస్, బీజేపీ అసంత్రుప్త ఎంపీలు సైతం కేసీఆర్ తో చేతులు కలిపే విధంగా రహస్య సమావేశాల బాధ్యతలు కూడా ఈ సమన్వయ కమిటీకె కేసీఆర్ కట్టబెట్టారని చెబుతున్నారు. 

అయితే రైతుల్లో కూడుగట్టుకున్న అసంతృప్తినే ప్రధాన ఎజెండాగా మార్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. వ్యవసాయ సంక్షోభంతో దేశ వ్యాప్తంగా రైతాంగం రగిలిపోతుంది. రాజస్థాన్ లో రోజుల తరబడి రోడ్లను దిగ్బంధం చేసిన రైతన్నలు ఇప్పుడు మహరాష్టలో 25 వేల మంది రైతులు నాసిక్ నుంచి ముంబాయికి మహాపాదయాత్ర చేపట్టారు. తమిళ నాడు రైతులు ఢిల్లి విదుల్లో తమ నిరసనను కొనసాస్తూనే ఉన్నారు. అందుకే రైతు ఎజెండాగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడితే జాతీయ రాజకీయాల్లో తిరుగుండదని కేసీఆర్ భావిస్తున్నారు. కేంద్ర పెత్తానన్ని ప్రశ్నిస్తూనే నదుల అనుసంధానం, నది జలాల పంపిణి వంటి అంశాలను ఆయా రాష్టాల నేతలతో చర్చనీయాంశాలుగా  మార్చాలని నిర్ణయించారు. అయితే రాష్టాల వారిగా సామాజిక, రాజకీయ, ఆర్దిక భిన్న పరిస్థితులు నెలకొన్నందున వాటిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి చర్చలకు సానుకూల వాతారణం ఏర్పడేలా చేసే బాద్యతలను సమన్వయ కమిటీ నిర్వర్తించనుంది. 

మొత్తంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్, దేశ పర్యటన, అందు కోసం సమన్వయ కమిటీ ఏర్పాటు తదితర అంశాలు ఏవరి రాజకీయ ప్రయోజనాలను కాపాడుతాయో మరెవరి ప్రయోజనాలను దెబ్బకొడుతాయో అని గులాబి పార్టీలో ఘాటైన చర్చ నడుస్తోంది. 
 

English Title
Telangana CM KCR Puts Friendship, Enmity Aside to Push for a 'Third Front'

MORE FROM AUTHOR

RELATED ARTICLES