తెలంగాణలో కొలువుల జాతర...9,200 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశం

Submitted by arun on Mon, 07/23/2018 - 10:22
kcr

తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. కొత్తగా 9 వేల 2 వందల పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పల్లెసీమలను ప్రగతి సీమలుగా మార్చే కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రతి గ్రామానికీ ఒక పంచాయతీ కార్యదర్శి కచ్చితంగా ఉండేలా కొత్తగా 9 వేల 200 మంది పంచాయతీ కార్యదర్శులను నియమించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. వారం రోజుల్లో నియామక ప్రక్రియ ప్రారంభించి.. రెండు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కొత్తగా నియామకమయ్యే పంచాయతీ కార్యదర్శులకు మూడేళ్ల వరకు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందని ఆ తర్వాత వారిని పనితీరు ఆధారంగా క్రమబద్ధీకరించాలని కేసీఆర్ చెప్పారు. ప్రొబేషన్ టైంలో నెలకు 15 వేలు జీతం ఇవ్వాలన్నారు. పంచాయతీ కార్యదర్శుల నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలోనే జిల్లా కేడర్‌లో నియామకాలు జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకనుగుణంగా విధివిధానాలు రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ ఎస్‌కే జోషికి సీఎం స్పష్టం చేశారు.

తెలంగాణలో ప్రస్తుతం 12 వేల 751 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 3 వేల 562 పంచాయతీలకు మాత్రమే కార్యదర్శులున్నారు. అందువల్ల ఒక కార్యదర్శి మరో పంచాయతీకి ఇన్‌ఛార్జిగా ఉండే విధానానికి స్వస్తి పలకాలని సీఎం నిర్ణయించారు. పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో  ఆమోదముద్ర వేయనున్నట్లు ప్రకటించారు.

English Title
Telangana CM announces recruitment of 9,200 Panchayat Raj

MORE FROM AUTHOR

RELATED ARTICLES