తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది గంటల్లో...

Submitted by chandram on Thu, 12/06/2018 - 18:49
tg

తెలంగాణలో మహాయుద్ధాని మరికొన్ని గంటలే సమయం ఉంది. దీంతో పోల్ తెలంగాణ కోసం అధికారయంత్రాంగం సర్వం సిద్దం చేసింది. భారీ భద్రత మధ్య ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.  ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. మరికొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల సంగ్రామంలో ఆఖరి అంకానికి తెరలేవనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కు ఏర్పాటు పూర్తి చేసింది ఈసీ. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పోలింగ్ సాఫీగా జరిగేలా అన్ని రకాల చర్యలను తీసుకుంది. ఈసీ రజత్ కుమార్ నుంచి కిందిస్దాయి ఉద్యోగి వరకు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. పలు విభాగాల మధ్య సమన్వయం కల్పిస్తూ ఈసీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో నగదు ప్రవాహం, మద్యం తరలింపు, కానుకల పంపిణీలపై నిఘా ముమ్మరం చేసింది. పోలింగ్ సమయంలో విధులు నిర్వహించనున్న సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 వేల 796 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఈసీ రజత్ కుమార్ తెలియజేశారు. మొత్తం రెండున్నర లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్టు వివరించారు. వెబ్ కాస్టింగ్ , లైవ్ వీడియో ద్వారా పోలింగ్ జరుగుతున్న తీరుని  పర్యవేక్షించనున్నారు. 

పటిష్ట భద్రత నడుమ ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ లను కూడా  ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఓటర్లతో పాటు పోలింగ్ ఏజెంట్ల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు  రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో మహిళలు, వికలాంగుల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు ఉచిత రవాణా వసతి కల్పించారు. దీంతో పాటు వృద్ధుల కోసం ప్రత్యేక వసతులు కల్పించారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సమస్యత్మాక ప్రాంతాలుగా గుర్తించిన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు, మిగిలిన చోట్ల ఐదు గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఈసీ తెలిపింది.

English Title
Telangana Assembly polls in few hours

MORE FROM AUTHOR

RELATED ARTICLES