పూల మద్యలో కొలువుదీరిన ఈ గౌరమ్మే బతుకమ్మ

Highlights

పూల మద్యలో కొలువుదీరిన ఈ గౌరమ్మే బతుకమ్మ అన్నది తెలంగాణ ప్రజల నమ్మకం. ఆ తల్లే... శ్రీ మహాలక్ష్మి అవతారమని విశ్వాసం. తంగెడు పువ్వంటే గౌరమ్మకు ఇష్టమనీ,...

పూల మద్యలో కొలువుదీరిన ఈ గౌరమ్మే బతుకమ్మ అన్నది తెలంగాణ ప్రజల నమ్మకం. ఆ తల్లే... శ్రీ మహాలక్ష్మి అవతారమని విశ్వాసం. తంగెడు పువ్వంటే గౌరమ్మకు ఇష్టమనీ, గౌరి పూజకు తప్పక తంగెడు పువ్వును వాడడం ఆనవాయితీగా వస్తోంది. కొద్దిగా పసుపు తీసుకొని దాన్ని నీళ్లతో తడిపి నాలుగు వేళ్లతో ముద్దగా చేసి నిలబెడతారు. దానికి పసుపు కుంకుమలు అద్ది పసుపు గౌరమ్మ మీద వేస్తారు. ఆ గౌరమమ్మే బతుకమ్మ అనీ, బతుకమ్మే గౌరమ్మ అనీ పూజిస్తారు.

బతుకమ్మను పూజిస్తే ఆడవాళ్లకు ఆరోగ్యమనీ, కోరిన కోరికలు ఫలిస్తాయనీ, ఆయుష్షు, సకల సంపదలు పెరిగి ముత్తయిదువులగా ఉంటారని తెలంగాణ పల్లెల్లో, ఆ ప్రాంత ప్రజల్లో నమ్మకం. ఇక -బతుకమ్మను పేర్చడం అంత సులువేమీ కాదు పట్టుకుంటే తునిగి పోయే తంగేడు పూలను ఒద్దికగా పేర్చుకుంటూ బతుకమ్మను చేయాలంటే ఎంతో ఓపిక నైపుణ్యం కావాలి ఏ మాత్రం తేడా వచ్చినా కష్ట పడి పేర్చిన బతుకమ్మ క్షణంలో చెదిరిపోతుంది అందుకే బతుకమ్మను పేర్చడం కూడా ఒక కళే.

తంగెడు పువ్వు, బంతిపువ్వు, గునుగుపువ్వు, గుమ్మడి పువ్వు, తీగమల్లె, మంకన పువ్వు, ఛత్రి పువ్వు, గులాబి, పోకబంతి, కనకాంబరాలు, గన్నేరుపూలు, గోరెంకపూలు ఇట్లా ఎన్నో రకాల పువ్వులు బతుకమ్మలో కొలువుదీరుతాయి బతుకమ్మ ఎత్తుగా పేర్చడానికి గునుగు పువ్వులను మొదలు కత్తిరించి రకరకాల రంగులల్లో అద్ది చిన్నచిన్న కట్టలుగా కట్టి పేర్చుకుంటారు. బతుకమ్మను పేర్చి మొదట దర్వాజ ఎదురుగా గోడ దగ్గర పీట వేసి వుంచుతారు. అగరొత్తులు ముట్టిస్తారు. ఎదురుగా పళ్లెంలో గౌరమ్మను ఉంచుతారు. ఆ పసుపు గౌరమ్మే బతుకమ్మ, అన్ని పండుగలకు పెట్టే ప్రసాదాలు వేరు బతుకమ్మకు సమర్పించే ప్రసాదాలు వేరు తొమ్మిది రోజులు జరిపే బతుకమ్మ వేడుకల్లో తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలు బతుకమ్మకు సమర్పిస్తారు.

ఇదీ పల్లె పడుచుల పండుగ తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మ వేడుక అనాదిగా వస్తున్న సంస్కృతీ సంప్రదాయాల వెనుక దాగి ఉన్న విజ్ఞాన విషయాలు మనిషిని ఆరోగ్యంగా చేస్తాయని అంటువ్యాధులు ప్రబలకుండా ఈ ఆయుర్వేద సూత్రాలు కాపాడుతాయని విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతోంది. మట్టి మనుషుల మనసుల నిండా పూలవాసన గుప్పుమని గుభాళించే పండగలో బతుకమ్మ పండగను ప్రత్యేకంగా చెప్పుకుంటారు. కొమ్మ కొమ్మ సిగలో పూసిన పూలను కొన గోటితో తెంపుకొని ఒద్దికగా ఒడి నింపుకొని భక్తితో ఇంటికి తెచ్చుకుంటారు తెలంగాణ ఆడపడుచులు. అందుకే ఏఇంట చూసినా బతుకమ్మల ముచ్చట్టే ఎంగిలిపువ్వు బతుకమ్మతో ఆరంభమై, సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ పండగ తెలంగాణ పల్లె పల్లెనా గుభాలిస్తుంది.

వర్షాలు తగ్గుముఖం పట్టి నేలపై పుట్టిన ప్రతి కొమ్మా పూవుకు పురుడు పోసే పూల రుతువిది నేలమ్మ సిగలో ప్రకృతి మాత తురిమిన పూలచెండు వెన్నెలై వెలుగులు చిమ్ముతుంది ఆ పండు వెన్నెల్లో పూల వెలుగుల్లో పడుచు కన్నులు చెంపలను నిండుతాయి. ఏపుగా ఎదిగిన పంటల నడుమ. విరగపూసిన పువ్వులతో సాయంకాలం వరకూ బతుకమ్మలను పేర్చుకుంటారు. గౌరమ్మను పూజిస్తారు. ఫలహారాలు చేసుకుంటారు. ఇండ్లు, వాకిళ్లు అలికి, పూసి, ముగ్గులు వేసి, శుచిగా తీర్చి దిద్దుకుంటారు. ఉన్న దాంట్లోనే శుభ్రమైన బట్టలు కట్టుకొని బతుకమ్మ ఆటకు బయలు దేరుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories