కాకరేపుతోన్న దేశ రాజకీయాలు

Submitted by arun on Mon, 03/19/2018 - 10:40
Andhra Pradeshspecial status

కేంద్రంపై టీడీపీ, వైసీపీ ఎక్కుపెట్టిన అవిశ్వాస అస్త్రంతో దేశ రాజకీయాలు కాకరేపుతున్నాయి. మోడీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవడాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. దాంతో అవిశ్వాస తీర్మానంపై అధికార, విపక్షాలు ఎత్తుకు పైఎత్తులు హీటు పుట్టిస్తున్నాయి. దాంతో ఇవాళ లోక్‌సభలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. 

టీడీపీ, వైసీపీ ప్రకటించిన అవిశ్వాస యుద్ధంతో వేడెక్కిన దేశ రాజకీయాలు కాకరేపుతున్నాయి. మోడీ సర్కార్‌పై వేర్వేరుగా అవిశ్వాస తీర్మానాలిచ్చిన టీడీపీ, వైసీపీలు విపక్షాల మద్దతు కూడగడుతున్నాయి. అయితే కేంద్రంపై దూకుడుగా కాలు దువ్వుతోన్న తెలుగుదేశం పార్టీ మరింత వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే 100మందికి పైగా ఎంపీల సంతకాలు సేకరించిన టీడీపీ అవిశ్వాసానికి మద్దతిచ్చే ఎంపీల సంఖ్య 200 దాటుతుందని చెబుతోంది. అదే సమయంలో తన ఎంపీలకు టీడీపీ విప్‌ జారీ చేసింది. పార్లమెంట్‌ జరిగినన్ని రోజులూ కచ్చితంగా సభకు హాజరుకావాలని ఆదేశించింది.

అయితే మొన్నటివరకూ మిత్రపక్షంగా ఉండి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఒక్కసారిగా తెగదెంపులు చేసుకొని మోడీ సర్కార్‌‌పైనే అవిశ్వాస అస్త్రం ఎక్కుపెట్టడంతో బీజేపీ కూడా సీరియస్‌గా తీసుకుంది. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సునాయాసంగా ఓడిస్తామన్నారు. ఎన్డీఏకు 300కు పైగా సభ్యుల మెజారిటీ ఉందన్నారు. ఓటింగ్ అంటూ జరిగితే సభలో ఓడిపోతామని విపక్షాలకు బాగా తెలుసని అందుకే సభను సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

అయితే టీడీపీ, వైసీపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాలిచ్చినా స్పీకర్‌ నిర్ణయం కీలకంగా మారనుంది. దాంతో స్పీకర్ ఏం చేయబోతున్నారన్నదే ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. రెండు పార్టీలూ గత శుక్రవారమే అవిశ్వాసం నోటీసులు స్పీకర్ ముందుకు వచ్చినా... సభ సజావుగా లేదంటూ వాయిదా వేశారు. దాంతో ఇవాళ మరోసారి తీర్మానాలిచ్చాయి రెండు పార్టీలు. దాంతో ఇవాళ ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. మరి ఈరోజైనా అవిశ్వాసంపై చర్చకు అనుమతిస్తారా? లేక రచ్చ పేరుతో వాయిదా వేస్తారో?

English Title
TDP, YSR Congress to Push for No-Confidence Motion Today

MORE FROM AUTHOR

RELATED ARTICLES