కేంద్రం ఇస్తున్న నిధులు ‘బాహుబలి’ కలెక్షన్స్ కంటే తక్కువ

కేంద్రం ఇస్తున్న నిధులు ‘బాహుబలి’ కలెక్షన్స్ కంటే తక్కువ
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఇస్తున్న నిధులు ‘బాహుబలి’ కలెక్షన్స్ కంటే తక్కువగా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. బడ్జెట్...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఇస్తున్న నిధులు ‘బాహుబలి’ కలెక్షన్స్ కంటే తక్కువగా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం చేశారంటూ బుధవారం నాడు లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీశారు గుంటూరు ఎంపీ జయదేవ్. ఎన్టీఏలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ.. ఆంధ్రప్రదేశ్ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తైందని విభజన సమస్యతో ఆర్థికంగా ఏపీ నలిగిపోయిందన్నారు.

సుమారు 14 నిమిషాలపాటు ఆంగ్లంలో అనర్ఘళంగా చేసిన ప్రసంగంలో ప్రధాని, ఆర్థిక మంత్రిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌... మీ సంకీర్ణ భాగస్వాములకు మీరు ఎలాంటి సందేశం పంపాలనుకుంటున్నారు? మీ చేతిలో మోసపోయామని, అవమానాలకు గురవుతున్నామని భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నాయి. ఐదుకోట్ల మంది ఏపీ ప్రజలూ అదే భావిస్తున్నారు. విభజన హామీలను నెరవేర్చకుండా ఏపీలో టీడీపీని బలహీనపర్చి, మీరు (బీజేపీ) బలపడవచ్చని మీ పార్టీ నేతలు మీకు తప్పుడు సలహా ఇచ్చి ఉండవచ్చు. ఇలాంటి తప్పుడు సలహాలతో ఉమ్మడి ఏపీని విభజించి, 2014 ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన కాంగ్రెస్‌ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఏపీ ప్రజలను మోసగించడం ద్వారా తెలంగాణలో లబ్ధి పొందాలని, వైసీపీతో రహస్య ఒప్పందం ద్వారా ఏపీలోనూ అధికారం చలాయించవచ్చని కాంగ్రెస్‌ భావించింది, కానీ... ఏపీ ప్రజలు తెలివి తక్కువ వాళ్లు కాదు. కాంగ్రెస్ నూ పూర్తిగా తుడిచిపెట్టేశారు. వైసీపీ ఎత్తులనూ చిత్తు చేశారు. అలాంటి తప్పుడు వ్యూహాలను అనుసరిస్తే బీజేపీకి అంతకన్నా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశపడొద్దు’’ అని హెచ్చరించారు. వైసీపీ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు.

‘‘వైసీపీ నేతలు కేంద్ర బడ్జెట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీ పంచన చేరేందుకు ఆరాటపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి భజన చేయడం వైసీపీ నేతలకు అలవాటు. ఆ పార్టీ అధినేత జైలుకు వెళ్లకుండా ఉండాలంటే వారికి అంతకు మించి ప్రత్యామ్నాయం లేదు’’ అని జయదేవ్‌ పేర్కొన్నారు. ‘‘దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన వ్యక్తి నేతృత్వంలోని పార్టీ మద్దతు పొందడం ద్వారా దేశ ప్రజలకు బీజేపీ ఎలాంటి సందేశం పంపుతోంది? ఏపీలో టీడీపీ కన్నా వైసీపీ మెరుగైన భాగస్వామి పక్షంగా ఉంటుందని బీజేపీ భావిస్తుందా?’’ అని సూటిగా ప్రశ్నించారు.‘‘కొంత మందిని ఎప్పుడూ మోసం చేయవచ్చు. కొంత మందిని అప్పుడప్పుడు మోసం చేయవచ్చు. కానీ ఎప్పుడూ అందరినీ మోసం చేయలేరు. ఏపీ ప్రజలు కానీ, టీడీపీ కానీ మోసపోయే వారి జాబితాలో ఉండరు’’ అని తేల్చిచెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories