పాత మిత్రులపై కొత్త యుద్ధం.. ఏపీ టీడీపీ యాక్షన్‌ ప్లాన్‌

పాత మిత్రులపై కొత్త యుద్ధం.. ఏపీ టీడీపీ యాక్షన్‌ ప్లాన్‌
x
Highlights

ఏపిలో రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారబోతున్నాయా? కర్ణాటకలో పాగా వేయాలనుకుంటున్న బిజెపి ఇటు ఏపీలోనూ కొత్త మిత్రులను వెతుక్కుంటోందా? అధికారం గుప్పిట...

ఏపిలో రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారబోతున్నాయా? కర్ణాటకలో పాగా వేయాలనుకుంటున్న బిజెపి ఇటు ఏపీలోనూ కొత్త మిత్రులను వెతుక్కుంటోందా? అధికారం గుప్పిట పట్టడం కోసం పాత మిత్రులపై యుద్ధం మొదలు పెట్టిందా? బిజెపి అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా?

ఏపిలో రాజకీయం రక్తి కడుతోంది. శత్రువు శత్రువుకు మిత్రులవుతున్నారు.. ఉప్పు, నిప్పులా మారిన టిడిపి, బిజెపి బంధం ఇప్పుడు కొత్త రాజకీయ సమీకరణలకు దారి తీస్తోంది. దక్షిణాదిన పాగా వేయాలనుకుంటున్న బిజెపి కర్ణాటక ఎన్నికల కోసం కత్తులు దూస్తున్న తరుణంలో టిడిపి అక్కడి తెలుగు వారికి ఇచ్చిన పిలుపు బిజెపి నేతలకు కోపం తెప్పించింది. ఏపికి హోదా ఇవ్వని బిజెపికి ఓటు వేయద్దంటూ చంద్రబాబు స్వయంగా పిలుపు నివ్వడంపై బిజెపి మండిపడింది. పనిలో పనిగా పాత వివాదాలనూ తెరపైకి తెచ్చింది. మొన్నటి వరకూ చంద్రబాబును సీనియర్ మోస్ట్, సిన్సియర్ సిఎం అని కీర్తించిన బిజెపి ఇవాళ ఒక్కసారిగా ఎదురు దాడి చేసింది.
తెలుగు, కన్నడ ప్రజల మధ్య విభేదాలు తలెత్తే విధంగా చంద్రబాబు చేస్తున్నారని విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు.. అంతేకాదు.. ప్రతిపక్ష వైసిపిని పొగడ్తలతో ముంచెత్తారు. 2019 ఎన్నికల్లో విజయం ఎవరిదో కూడా స్పష్టం చేసేశారు. నిజానికి వైసిపి, బిజెపి మధ్య ఈ స్నేహం గత కొన్నాళ్ల నుంచే పెరుగుతూ వస్తోంది. బిజెపి నేత సోము వీర్రాజు గతంలోనే టిడిపిపై విమర్శల దకూడుకు పెంచారు. వైసిపి పట్ల కొంత సానుకూలంగా మాట్లాడుతూ వచ్చారు.

ఏపికి హోదా విషయంపై తేల్చమని బిజెపి పెద్దలను నిలదీసిన ప్రతీసారి కర్ణాటక ఎన్నికల తర్వాత ఏపి గురించి బిజెపి ఆలోచిస్తుందన్న సంజాయిషీ వినిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఏపి రాజకీయాలు ఊహించని విధంగా మారబోతున్నాయా? మొన్నటి వరకూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బిజెపి ఇప్పుడు టిడిపిపై అవినీతి ఆరోపణల వేగం పెంచింది. రాజధాని, పట్టి సీమ, పోలవరం నిర్మాణాల్లో టిడిపి అవినీతిని కాగ్ ఎండగట్టిందని వాటిపై విచారణలు జరగాల్సి ఉందని విమర్శల వేడి పెంచుతూ వచ్చింది. మరోవైపు కేంద్రం ఎత్తుగడలను గమనించే ఏపి సిఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు.. ధర్మ పోరాట దీక్షల పేరుతో ఊరూరా సభలు ఏర్పాటు చేస్తున్నారు.. తమపై బిజెపి, వైసిపి, జనసేన చేసే ముప్పేట దాడిని ఎదుర్కోడానికి కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మొత్తం మీద ఏపి రాజకీయాలు ఊహించని విధంగా మారబోతున్నాయా? బిజెపి వైసిపికి దగ్గరవుతోందా? ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీల దోస్తీ బయటపడుతుందా? తమపై పెరుగుతున్న ముప్పేట దాడిని టిడిపి ఎలా ఎదుర్కొంటుంది?

Show Full Article
Print Article
Next Story
More Stories