హయత్‌ హోటల్‌లో బుజ్జగింపుల పర్వం..

Submitted by chandram on Sun, 11/18/2018 - 16:25
park

ఆశావహులు, అసంతృప్తులు, రెబల్స్‌తో కాంగ్రెస్‌ బుజ్జగింపుల కమిటీ సమావేశం కొనసాగుతోంది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో కమిటీతో అసంతృప్తులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. పొత్తుల పేరుతో తమకు టిక్కెట్లు నిరాకరించొద్దంటూ వేడుకుంటున్నారు. ముఖ్యంగా వరంగల్‌ వెస్ట్‌ టిక్కెట్‌ ఆశిస్తున్న డీసీసీ ప్రెసిడెంట్‌ నాయిని రాజేందర్‌రెడ్డి తనకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గత 20 యేళ్లుగా కాంగ్రెస్‌ కు అవకాశం రాలేదని ఈ సారి టీడీపీ గెలిచే అవకాశం లేదని కమిటీ ముందు వాపోయారు. 

మరోవైపు పాల్వాయి స్రవంతి కూడా రేసులో ఉన్నారు. మునుగోడు కార్యకర్తలంతా తనతోనే అండగా ఉన్నారని 20 యేళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నానంటూ కమిటీ ముందు చెప్పుకొచ్చారు. రాహుల్‌ కూడా అండగా ఉంటానని చెప్పినా టిక్కెట్‌ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజేంద్రనగర్‌ టిక్కెట్‌ ఆశించి పార్టీకి రాజీనామా చేసిన సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక రెడ్డి కూడా బుజ్జగింపుల కమిటీ ముందు హాజరయ్యారు. రాజేంద్రనగర్‌ను టీడీపీకి ఎలా ఇస్తారని కమిటీ సభ్యులను ప్రశ్నించినట్లు తెలుస్తుంది. తర్వాత ఆయన హెచ్‌ఎంటీవీతో మాట్లాడుతూ రాజేంద్రనగర్‌ టిక్కెట్‌ను కాంగ్రెస్‌కు కేటాయించాలని లేకుంటే అక్కడ అధికార పార్టీ అభ్యర్థే విజయం సాధించే అవకాశం ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అన్ని విషయాలు కమిటీ ముందుంచానని తేల్చిచెప్పారు. 

వీరే కాకుండా దుబ్బాకకు చెందిన చిందం రాజ్ కుమార్, ఇబ్రహీంపట్నానికి చెందిన మల్‌రెడ్డి రంగారెడ్డి భేటి అయ్యారు. గెలుపు అవకాశాలున్న నియోజకవర్గాలను చేజేతులా దూరం చేసుకోవద్దంటూ కమిటీ సభ్యులకు సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తో పాటు ఏఐసీసీ కార్యదర్శులు సలీమ్, శ్రీనివాస కృష్ణన్ లు బుజ్జగింపుల కమిటీని కలిసిన వారిలో ఉన్నారు. 

English Title
T.congress Seat Sharing Problems

MORE FROM AUTHOR

RELATED ARTICLES