కుంతియాను లైట్ తీసుకున్నారు

Submitted by arun on Fri, 03/09/2018 - 10:26
RC Khuntia

తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ను పీసీసీ నాయకులు లైట్ తీసుకున్నారా.? కుంతియాను పార్టీ ఇంచార్జ్‌గా పరిగణించడం లేదా..? కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సుయాత్రలో ఆయనెందుకు కనిపించడం లేదు.? అసలేం జరుగుతోంది టీ కాంగ్రెస్‌లో.. 

టీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాచైతన్యయాత్రలో రాష్ట్రకాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాకు అవమానం జరిగిందా.? అందుకే.. కుంతియా బస్సుయాత్రలో కనిపించడం లేదా.? గాంధీభవన్‌లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. గత నెల 26న చేవెళ్ల వేదికగా టీపీసీసీ ప్రజాచైతన్యయాత్ర ప్రారంభించింది. చేవెళ్ల బహిరంగసభలోనే కుంతియాకు అవమానం జరిగిందట. ఆయన వేదికపైకి వచ్చినా పార్టీ నేతలు కూర్చునేందుకు కుర్చీ ఇవ్వకపోవడంతో ఆయన కింద ఉన్న కుర్చీలో కూర్చున్నారట. కాసేపటి తర్వాత పార్టీ నేతలు కుంతియాని వేదికపైకి పిలిచారట. ఈ వ్యవహారంతోనే కుంతియా అసంతృప్తి చెందినట్లు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

చేవెళ్ల సభ తర్వాత వికారాబాద్, తాండూర్, సంగారెడ్డి సభల్లో ఏదో నామ్ కే వాస్తే అన్నట్లుగా కుంతియా హాజరైనట్లు కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. సంగారెడ్డి సభ తర్వాత మిగతా బహిరంగసభల్లో కుంతియా ఇప్పటివరకు పాల్గొనలేదు. పార్టీ నేతల తీరుపై ఉన్న అసంతృప్తితోనే కుంతియా బస్సుయాత్రలో పాల్గొనడం లేదనే ప్రచారం జరుగుతోంది. 

గతంలో టీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌లుగా గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ పనిచేసినప్పుడు వారికి ఇచ్చిన ప్రాధాన్యత, మర్యాద, గౌరవం ఇప్పుడు తనకు ఇవ్వడం లేదని కుంతియా ఫీలవుతున్నారట. టీపీసీసీ నేతలు కూడా కుంతియాను లైట్ తీసుకున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీకి కొత్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఐతే తొలి విడత బస్సుయాత్ర చివరిరోజు కుంతియా ప్రోగ్రాంలో పాల్గొనే విధంగా పీసీసీ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈసారి కుంతియా హాజరవుతారా లేరా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

English Title
TCongress Leaders not Follow RC Khuntia

MORE FROM AUTHOR

RELATED ARTICLES