తమిళ సర్కార్‌ వర్సెస్‌ సర్కార్‌

Submitted by santosh on Fri, 11/09/2018 - 13:13
Tamil sarkar VS sarkar

తమిళనాట సరికొత్త దుమారానికి తెర లేచింది. ఉప్పు, నిప్పులా మారిన డిఎంకె, అన్నాడీఎంకే మధ్య నటుడు విజయ్ ఓ కొత్త సినిమాతో చిచ్చు రేపాడు. విజయ్ నటించిన సర్కార్ సినిమా ఇప్పుడు కాక రేపుతోంది. సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీపై అన్నాడిఎంకే భగ్గుమంటోంది.  దీపావళి కానుకగా తమిళనాట విడుదలైన సర్కార్  విజయ్ మార్క్ పంచ్ డైలాగులతో సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. అయితే ఈ మూవీపై ఇప్పుడు అన్నా డీఎంకే శ్రేణులు కేసులు పెడతామంటున్నారు. డిఎంకే నేత,  సన్ నెట్ వర్క్ ఛైర్మన్ కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బేనర్ పై తీసిన ఈ సినిమాలో జయలలిత పాలనపై పంచ్ లున్నాయి..సినిమాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనపడే విజయ్ సంక్షేమ పథకాలపై ఓ రేంజ్ లో విమర్శలకు తెర లేపారు. 

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత అమ్మ  పేరుతో అమలు జరిపిన అన్ని సంక్షేమ పథకాలనూ చిత్రంలో హీరో ఎండగడతాడు..పేదలకు ఉచితాలు పంచడం వారిపై ప్రేమతో కాదు.. రాజకీయాలకు వారిని వాడుకోడమేననే విధంగా విజయ్ డైలాగులున్నాయి. దాంతో ఇది తమిళ సర్కార్ కు హీరో విజయ్ కు మధ్య వివాదంగా మారిపోయింది. జయ లలిత  సంక్షేమ పథకాలపై విమర్శలతో కూడిన డైలాగులను తప్పించాలని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కడంబుర్ సి రాజు హీరో విజయ్ కు అల్టిమేటం ఇచ్చారు. విజయ్ లాంటి రైజింగ్ లో ఉన్న నటుడికి ఇలాంటి రాజకీయాలు అనవసరం అంటూ మంత్రి మాట్లాడారు. డైలాగులను తక్షణం తొలగించకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సి వస్తుందని ముఖ్యమంత్రి పళనిస్వామితో కలసి ఏం చేయాలన్నది నిర్ణయిస్తామనీ అన్నారు. విజయ్ పైనా, ప్రొడ్యూసర్ కళానిధి మారన్ పైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్షేమ పథకాలు పేదల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి అమలు జరిపేవేనని అంతేతప్ప వారి ఓట్లను కాజేయడానికి వేసే ఎర కాదని అన్నా డిఎంకె నేతలు కుండబద్దలు కొడుతున్నారు. అన్నాడిఎంకే అధినేత్రి జయలలితపై దుష్ర్పచారం చేస్తే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరిస్తున్నారు.. మరోవైపు నటుడు మక్కల్ నీదీ మయ్యుం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ విజయ్‌ను సమర్ధించారు. ఈ సినిమా అన్నాడిఎంకే అవినీతికి చెంప పెట్టులాంటిదని అన్నారు. జయలలిత సంక్షేమ పథకాలన్నీ ఒట్టి బోగస్ అని  కమల్ విమర్శించారు. సర్కార్ సినిమా నిర్మాణంలోనే సమస్యలు చుట్టుముట్టాయి. చిత్రం కథ కాపీరైట్స్ పై వరుణ్ రాజేంద్రన్ అనే రచయిత కోర్టు కెక్కారు. తన కథ సెన్ గల్ ను మురుగదాస్ కాపీ కొట్టారంటూ ఆరోపించారు. అయితే ఈ వివాదం ఆ తర్వాత కోర్టు బయట పరిష్కారమయింది.

English Title
Tamil sarkar VS sarkar

MORE FROM AUTHOR

RELATED ARTICLES