డిసెంబర్‌ నాటికి మందిరంలో ఉంటాడా.. రాముడు!! స్వామిజీల లెక్కేంటి?

Submitted by santosh on Mon, 11/05/2018 - 16:19
swamys says about ram mandir in december

ఎవరేమనుకున్నా.. ఎలాంటి పరిణామాలొచ్చినా డిసెంబర్ లో రామ మందిర నిర్మాణం తధ్యమని స్వామీజీలు తేల్చి చెబుతున్నారు. అవసరమైతే పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్స్ బిల్లు ద్వారా  ఈ  అంశంపై ప్రభుత్వం చొరవ చూపాలని కొందరంటుంటే.. ప్రభుత్వంతో సంబంధం లేకుండా డిసెంబర్ లో మందిర నిర్మాణం ప్రారంభించేస్తామంటున్నారు స్వామీజలు.

సార్వత్రిక ఎన్నికలకు ముందు బిజెపి మరోసారి రామ నామాన్ని జపిస్తోందా? మరోసారి రామ మందిర నిర్మాణం పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందా అంటే అవుననే చెప్పాలి. బిజెపి ప్రభుత్వం రామ మందిర నిర్మాణం అంశాన్ని తాము కదపకుండా  తమ అనుబంధ సంఘాల ద్వారా తెరపైకి తెస్తోంది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టులో కేసు నానుతుండటంతో స్వామీజీల్లో సహనం నశిస్తోంది. ఢిల్లీలో తాల్కతోరా స్టేడియంలో రెండురోజుల పాటూ జరిగిన సాధు సంతుల సమావేశం రామమందిర నిర్మాణమే ఎజెండాగా చర్చలు జరిపింది. ప్రభుత్వ నిర్ణయాలతో, కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా డిసెంబర్ నెలలోనే రామ మందిర నిర్మాణం జరుపుతామని ఈ సమావేశంలో పాల్గొన్న స్వామీజీలు తేల్చి చెప్పారు.

అయోధ్యలో మందిర నిర్మాణం జరపాలంటూ వీహెచ్ పి ఆర్డినెన్స్ లేదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తేవాలని బిజెపిపై ఒత్తిడి పెంచుతోంది. మందిర నిర్మాణం కోసం అవసరమైతే 1992 తరహా ఉద్యమాన్ని లేవనెత్తడానికి తాము వెనకాడబోమని ఆరెస్సెస్ ఇప్పటికే తేల్చి చెప్పింది. అయోధ్య కేసు విచారణపై సుప్రీం కోర్టులో జరుగుతున్న జాప్యం హిందువులను అవమానించడమేనని అందుకే మందిర నిర్మాణానికి అన్ని అవకాశాలు అడుగంటి పోతే  ఆర్డినెన్స్ తెచ్చయినా సరే నిర్మాణం జరిపి తీరాల్సిందేనని సమావేశంలో పాల్గొన్న సాధువులు, స్వామీజీలు తేల్చి చెబుతున్నారు. అయోధ్యలో మందిర నిర్మాణం కోసం గత 30 ఏళ్లుగా ఆరెస్సెస్ ప్రయత్నిస్తోందని ఇక సహనం అడుగంటిపోయిందని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు సున్నీ వక్ఫ్ బోర్డు కూడా రామ జన్మభూమి వివాదంపై సమావేశమై చర్చలు జరపాలని ఆలోచిస్తోంది.

English Title
swamys says about ram mandir in december

MORE FROM AUTHOR

RELATED ARTICLES