జనగామపై కొనసాగుతోన్న సస్పెన్స్‌

జనగామపై కొనసాగుతోన్న సస్పెన్స్‌
x
Highlights

65మందితో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ మరో పది మందితో సెకండ్‌ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. అయితే రెండో జాబితాలో కూడా పలువురు సీనియర్ల పేర్లు...

65మందితో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ మరో పది మందితో సెకండ్‌ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. అయితే రెండో జాబితాలో కూడా పలువురు సీనియర్ల పేర్లు కనిపించలేదు. కనీసం సెకండ్‌ లిస్ట్‌లోనైనా తమ పేరు ఉంటుందని ఆశించిన సీనియర్లకు మళ్లీ నిరాశే ఎదురైంది. ముఖ్యంగా జనగామ సీటు ఆశించి మొదటి లిస్టులో భంగపడిన టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యకు రెండో జాబితాలోనూ రిక్త హస్తమే ఎదురైంది. అలాగే సనత్‌‌నగర్ సీటు ఆశిస్తోన్న మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌‌రెడ్డి పేరు కూడా లేకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు.

జనగామపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. రెండో జాబితాలోనూ పొన్నాలకు చోటు దక్కకపోవడంపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్‌లో కాక రేపుతోన్న జనగామ సీటు వ్యవహారం ఎటూ తేలడం లేదు. సెకండ్‌ లిస్టులో కూడా పొన్నాల పేరు లేకపోవడంతో ఈ సీటు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. జనగామ టికెట్‌ పొన్నాలకు దక్కుతుందా? లేదంటే టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం కోసం ఆ సీటును కాంగ్రెస్‌ పార్టీ కేటాయిస్తుందా? అనే అంశం స్పష్టత రావడం లేదు. అయితే జనగామలో కోదండరాం పోటీ కోసం టీజేఎస్‌ నేతలు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీతోపాటు రాజకీయ వర్గాల్లో కూడా పొన్నాల, జనగామ టికెట్‌ ఎపిసోడ్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌ ప్రకటించిన మొదటి జాబితాలో పొన్నాల పేరు లేకపోవడంతో.... ఆయన హుటాహుటినా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పెద్దలను కలిసి తన సీటుపై చర్చలు జరిపారు. అయితే జనగామ తనదేనని, సెకండ్‌ లిస్టులో కచ్చితంగా తన పేరు ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కానీ రెండో జాబితాలోనూ పొన్నాల పేరు లేకపోవడంతో ఖంగుతిన్నట్లు తెలుస్తోంది.

పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్ నేత మొదట్నుంచీ కాంగ్రెస్‌నే నమ్ముకుని పార్టీకి నమ్మిన బంటులా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి టీపీసీసీ అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించారు. అలాగే జనగామ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గంపై తనదైన ముద్ర వేశారు. అంతేకాదు మూడు పర్యాయాలు మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి సీనియర్‌ నేత పొన్నాలకు టికెట్‌ కేటాయింపులో అధిష్టానం ఎందుకు జాప్యం చేస్తుందో తెలియక కాంగ్రెస్‌ శ్రేణులు సైతం విస్మయానికి గురతున్నారు.

జనగామను టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం కోసం కేటాయిస్తారన్న ప్రచారంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాంతో టికెట్‌ కోసం ఢిల్లీలో పెద్దలను కలుస్తూ మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు జనగామ నుంచి తాను పోటీ చేయడంపై కోదండరాం క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే జనగామ విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా టీజేఎస్‌కు కేటాయించాలని భావించడంతోనే జనగామను కాంగ్రెస్ హైకమాండ్‌ పెండింగ్‌లో పెడుతున్నట్లు చెబుతున్నారు. అయితే చివరి జాబితాలోనైనా పొన్నాలకు టికెట్‌ కేటాయిస్తారని ఆయన వర్గం ధీమాతో ఉంది. అంతేకాదు ఫైనల్‌ లిస్టులో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారనే సంకేతాల నేపథ్యంలో పొన్నాల పేరు కచ్చితంగా ఉంటుందని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories