సర్వేలు ఫలితాల్ని తేలుస్తాయా? సింహాసనమెక్కిస్తాయా?

సర్వేలు ఫలితాల్ని తేలుస్తాయా? సింహాసనమెక్కిస్తాయా?
x
Highlights

ఎవరు ఎక్కడ గెలుస్తారు...ఏ అభ్యర్థిపై ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉంది...సామాజిక సమీకరణల లెక్కలెలా ఉన్నాయి...ప్రత్యర్థి బలమేంటి...బలహీనత ఏంటి..పార్టీ...

ఎవరు ఎక్కడ గెలుస్తారు...ఏ అభ్యర్థిపై ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉంది...సామాజిక సమీకరణల లెక్కలెలా ఉన్నాయి...ప్రత్యర్థి బలమేంటి...బలహీనత ఏంటి..పార్టీ జనాభిప్రాయమేంటి...అంతిమంగా గెలుపు గుర్రమెవరు....ఇలాంటి ఆలోచనలకు సవివరమైన నిర్ధారణకు, సర్వేల బాట పట్టాయి రాజకీయ పార్టీలు. అన్ని ప్రధాన పార్టీలు, సర్వేల జపం చేస్తూ, జన నాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ పోరులో సర్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గెలిచే అభ్యర్థుల కోసం, సర్వేలనే నమ్ముకున్నాయి ప్రధాన పార్టీలు. గెలుపు గుర్రాల కోసం జల్లెడ పడుతున్నాయి.

అధికార టీఆర్‌ఎస్‌ ఇప్పటికే 16–17 సర్వేలు నిర్వహించింది. 105 మంది అభ్యర్థులను రంగంలోకి దింపింది. అయితే వీరిపైనా మరోసారి సర్వే నిర్వహిస్తోంది. ఇంటెలిజెన్స్‌ వర్గాలు, ప్రజానాడిని పసిగట్టడంలో బిజీగా ఉన్నాయని తెలుస్తోంది. అంటే 105 మంది అభ్యర్థుల్లో మళ్లీ వడపోత తప్పదని ఈ సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. అధికారపక్షమే కాదు, విపక్షాలు కూడా సర్వేలనే నమ్ముకున్నాయి. ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలో తేల్చేందుకు ప్రజాభిప్రాయ సేకరణను కేంద్ర బిందువుగా భావిస్తున్నాయి. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, సీపీఐ, టీజేఎస్‌లు, ఇలా ఏ పార్టీకా పార్టీ సర్వేల జపం చేస్తున్నాయి.

కేవలం పార్టీలే కాదు, అభ్యర్థులు కూడా వ్యక్తిగతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ఏ విషయంలో వెనకబడ్డాం, తమ పరిస్థితి నియోజకవర్గంలో ఎలా ఉంది.. బయటపడతామా...ఏ మండలంలో ఎలాంటి వాతావరణం ఉంది...ఏం చేస్తే వ్యతిరేకత ఉన్న చోట్ల ఓట్లు పడే అవకాశాలున్నాయనే కోణంలో ప్రజాభిప్రాయం సేకరిస్తున్నారు. అందుకు సోషల్ మీడియాను కూడా వేదికగా మలచుకుంటున్నారు. పార్టీలు కూడా ఫేస్‌బుక్‌‌లో అనేక ప్రశ్నలతో జననాడిని పసిగడుతున్నాయి. కాంగ్రెస్‌ అధిష్టానం సర్వేలనే నమ్ముతోంది. రాష్ట్ర నాయకత్వానికి తెలీకుండా, సొంతంగా సర్వేలు చేయించుకుంటోంది. అభిప్రాయసేకరణలో ఆశావహుల గుణగణాలు, ప్రత్యర్థి పార్టీలు, సామాజిక వర్గాల బలాబలాలపై దృష్టి సారించినట్లు సమాచారం. సర్వే ఫలితాలు నేరుగా ఢిల్లీకే వెళ్తాయని, అక్కడ సమాచారం మొత్తాన్ని క్రోడీకరించి, అభ్యర్థులను వడపోస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత ఆ సర్వే వివరాలు, రాష్ట్రానికి పంపుతారని సమాచారం.

బీజేపీకూడా సర్వేలనే ఆశ్రయిస్తోంది. జాతీయస్థాయి వర్గాల ద్వారానే ప్రజల మనోగతాన్ని ఆరా తీస్తోంది. బీజేపీ ఛీప్‌ అమిత్‌ షా పర్యవేక్షణలో ఉండే బృందం ద్వారా జరుగుతున్న ఫ్లాష్‌ సర్వేనే, అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తుందని కాషాయదళం అంటోంది. అభ్యర్థుల ఎంపికపై సతమతమవుతున్న మహాకూటమి, ఎవరిని ఫైనల్‌ చేయాలన్నదానికి, సర్వేలనే గీటురాయిగా భావిస్తోంది. అందుకే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రకరకాల ఫీడ్‌ బ్యాక్‌ను తెప్పించుకుంటోంది. నేరుగా సర్వే ప్రతినిధులను పంపడమే కాదు, ఫోన్లు, ఎస్మెమ్మెస్‌లు, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లను కూడా ప్రజాభిప్రాయసేకరణకు వాడుకుంటోంది.
సీపీఐ సైతం జనాల మనోగతం తెలుసుకోవడానికి, సర్వే బాటనే పట్టింది. రాష్ట్ర కార్యదర్శివర్గం, కార్యవర్గం, జిల్లా స్థాయిలో జరిగే సమావేశాల్లో నేతల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించుకొని, ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై వామపక్ష నేతలు అభిప్రాయానికి వస్తున్నారు. అటు అధికార టీఆర్‌ఎస్‌ సైతం, మరోసారి సర్వే చేయిస్తోంది. అభ్యర్థులను ప్రకటించకుండా మిగిలిన 14 నియోజకవర్గాల్లో సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ పార్టీ నేతల్లో ఎవరైతే మేలు జరుగుతుందనే కోణంలో అభిప్రాయ సేకరణ జరుగుతోందని టీఆర్ఎస్‌ వెల్లడిస్తున్నాయి. ఇలా అన్ని ప్రధాన పార్టీలు సర్వేల్లో మునిగిపోయాయి. గెలుపు గుర్రాల వేటకు, సర్వే మంత్రం జపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories