ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సర్కార్‌ తర్జనభర్జన

Submitted by arun on Sat, 06/09/2018 - 12:09

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. కార్మికులు సమ్మెకు దిగకుండా... సామదాన దండోపాయాలను ప్రయోగిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ యూనియన్లకు హెచ్చరికలు జారీ చేయగా మంత్రులు సైతం అనుసరించాల్సిన వ్యూహాలపై మంతనాలు జరుపుతున్నారు. అయితే ప్రభుత్వ హెచ్చరికల్ని లైట్‌ తీస్కుంటున్న కార్మిక సంఘాలు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదంటున్నాయి.

డిప్యూటీ సీఎం కడియం నివాసంలో స్ట్రాటజీ కమిటీ సమావేశమైంది. కడియం అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశానికి మంత్రులు ఈటల, హరీష్‌రావు, తుమ్మల, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఆర్టీసీ సమ్మె నోటీస్‌ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. అవసరమైతే ఎస్మా ప్రయోగించాలని భావిస్తోన్న స్ట్రాటజీ కమిటీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా చర్చిస్తున్నారు. మరోవైపు టీఎంయూ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న మంత్రి హరీష్‌రావుతో టీఎంయూ నేతలు సమావేశమయ్యారు. సమ్మె వ్యూహంపై చర్చిస్తున్నారు. అదే సమయంలో టీఎంయూ నేతల అభిప్రాయాలను హరీష్‌రావు తీసుకుంటున్నారు.

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె నివారణ దిశగా మంత్రుల బృందం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. నిన్న విస్తృత స్థాయిలో మంతనాలు జరిపిన మంత్రులు... ఇవాళ మరోమారు సమావేశమయ్యారు. మంత్రుల నివాస ప్రాంగణంలో జరుగుతోన్న సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌ రావు, ఈటల రాజేందర్‌, హరీశ్ రావు, కేటీఆర్, మహేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ కూడా సమావేశంలో పాల్గొన్నారు. సమ్మె నివారణ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు.

ఆర్టీసీ గుర్తింపు సంఘం టీఎంయూ నేతలతోనూ మంత్రుల బృందం సమావేశమైంది. ఇప్పటికే ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉందని... సమ్మె చేస్తే అప్పుల ఊబిలోకి మరింతగా కూరుకుపోతుందని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సమ్మెను విరమించి ఉద్యోగులు, కార్మికుల సమస్యలు సహా సంస్థ బాగోగులపై చర్చించాలని చెప్తున్నారు. కలసికట్టుగా ఆర్టీసీని లాభాలబాట పట్టిద్దామని యాజమాన్యం కార్మికులకు చెబుతోంది. సమ్మెపై ఈరోజు మధ్యాహ్నం టీఎంయూ నేతలు స్పష్టత ఇచ్చే అవకాశముంది.
 

English Title
Strategy Committee Meeting Begins at Kadiyam Residence Over RTC Employees Strike

MORE FROM AUTHOR

RELATED ARTICLES