మాల్యాకు ఓ న్యాయం..విజయసాయికి మరో న్యాయమా..?: చంద్రబాబు

మాల్యాకు ఓ న్యాయం..విజయసాయికి మరో న్యాయమా..?: చంద్రబాబు
x
Highlights

కేంద్రంపై చంద్రబాబు నాయుడు ధిక్కార స్వరాన్ని మరింత పెంచారు. అన్ని వ్యవస్థలను కేంద్రం భ్రష్టు పట్టించిందని ఘాటు విమర్శలు చేశారు. తనపై, తన ప్రభుత్వంపై...

కేంద్రంపై చంద్రబాబు నాయుడు ధిక్కార స్వరాన్ని మరింత పెంచారు. అన్ని వ్యవస్థలను కేంద్రం భ్రష్టు పట్టించిందని ఘాటు విమర్శలు చేశారు. తనపై, తన ప్రభుత్వంపై కేసులు పెట్టే ముందు అమిత్‌ షా కొడుకు జయ్ షా అవినీతి సంగతి తేల్చాలని డిమాండ్‌ చేశారు. అక్కడితో ఆగని చంద్రబాబు విజయ్ మాల్యాకు ఓ న్యాయం విజయసాయిరెడ్డికి మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు.

ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. నిన్నటి మిత్రులే శత్రువులుగా మారిపోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు కూడా తన విమర్శల పదును పెంచారు. ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షానే టార్గెట్‌ చేశారు. పార్టీ ఎంపీలు, కీలక నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తనపై, తన ప్రభుత్వంపై కేసులు పెట్టే ముందు అమిత్‌ షా కొడుకు జయ్‌ షా అవినీతి సంగతేంటని ప్రశ్నించారు. అప్పుల్లో నడుస్తున్న జయ్‌ షా కంపెనీలు ఏడాదిలోనే లాభాల్లోకి ఎలా వచ్చిందని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. తనపై కేసులు పెట్టే ముందు జయ్‌ షాపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

2014లో బీజేపీ అధికారంలోకి రావడంతో జయ్ షాకు చెందిన రెండు కంపెనీల టర్నోవర్‌ అమాంతంగా పెరిగిపోయిందంటూ ద వైర్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ కథనాన్ని ప్రచురించింది. జయ్‌ షా‌కు చెందిన టెంపుల్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్‌ లిమిటెడ్ కొన్నేళ్లుగా నష్టాల్లో నడుస్తోంది. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కంపెనీకి 15 కోట్ల రుణం అందడంతో సదరు కంపెనీ టర్నోవర్‌ 80 కోట్లకు పెరిగిందంటూ ద వైర్‌.ఇన్‌ కథనాన్ని ప్రచురించింది. జయ్‌ షా వ్యవహారంపై అప్పట్లో కాంగ్రెస్‌ కూడా విమర్శలు గుప్పించింది. ఏడాదిలోనే జయ్‌ షా కంపెనీ ఆస్తులు ఎలా పెరిగాయంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నారు.

అక్కడితో ఆగని చంద్రబాబు విజయ్‌మాల్యాకు ఓ న్యాయం విజయసాయిరెడ్డికి మరో న్యాయమా..? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేశారని, మరి జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయలేదని ఆయన నిలదీశారు. విజయ్‌ మాల్యా దేశం వదిలి వెళ్లిపోతే విజయసాయిరెడ్డి మాత్రం పీఎంవోలోనే ఉంటున్నారని విమర్శించారు. ఇద్దరు ఆర్థిక నేరస్థుల మధ్య వ్యత్యాసం ఏమిటని కేంద్రాన్ని చంద్రబాబు ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories