పాత చెవిని తీసేసి కొత్త చెవిని అమ‌ర్చుకోవ‌చ్చు

Submitted by lakshman on Tue, 02/13/2018 - 08:48
Chennai scientists grow ear

చెవి లోపంతో పుట్టిన ఐదుగురు పిల్లల కోసం ల్యాబ్‌లో చెవులను తయారు చేశామని వారం క్రితం చైనా ప్రకటించింది. సరిగ్గా వారం తిరిగిందో లేదో.. చెన్నై పరిశోధకులు కూడా ల్యాబ్‌లో కృత్రిమంగా చెవిని అభివృద్ధి చేశారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. కల్చర్ ఫ్లాస్క్‌లో తాము అభివృద్ధి చేసిన చెవి కార్టిలేజ్‌ను కుందేలులో ప్రవేశపెడితే.. చెవిగా అభివృద్ధి చెందిందని ఎస్ఆర్ఎం శాస్త్రవేత్తలు తెలిపారు. మునుపు అలా చేసిన ప్రయోగాలు ఎన్నో విఫలమయ్యాయని, తాము మాత్రం దీంట్లో విజయవంతమయ్యాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే, లోపంతో పుట్టే పిల్లలకు వీటిని పెట్టడానికి ముందు తాము చేయాల్సింది ఇంకా చాలానే ఉందని, కానీ, దానికి అనుగుణంగా ఈ విజయంతో సరైన దిశ దొరికినట్టయిందని సిమ్స్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కే శ్రీధర్ చెప్పారు. మనుషులపై దానిని ప్రయోగించడానికి ముందు భారీ సంఖ్యలో జంతువులపై ప్రయోగాలు చేసి ధ్రువీకరించుకుంటామని, ఆ తర్వాతే పరిశోధనాత్మకంగా మానవులకు వాటిని అమరుస్తామని చెప్పుకొచ్చారు. ఇక, కుందేలు చెవుల నుంచి తీసిన చెవి కార్టిలేజ్ కణాలను.. ప్రత్యేక ద్రావణంలో మూడు వారాల పాటు భద్రపరిచామని, ఆ ద్రావణంలోని పోషకాల ద్వారా ఆ కార్టిలేజ్‌లోని కణాలు పెరిగాక దానిని చెవి ఆకారంలో త్రీడీ ప్రింట్ తీశామని, దానిని కుందేలు పొట్ట చర్మం కింద అమర్చామని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ శంతను పాటిల్ తెలిపారు. వారం తిరిగాక చూస్తే కుందేలుకు అమర్చిన ఆ త్రీడీ ప్రింట్ చెవి కణాలు.. కుందేలులో కలిసిపోయి చెవిగా రూపుదిద్దుకున్నాయని చెప్పారు. కాగా, దాదాపు రెండేళ్ల పాటు శ్రమించి చేసిన ఈ పరిశోధనపై వారు పేటెంట్ తీసుకునే యోచనలో ఉన్నారు. 

English Title
SRM University scientists grow ear in lab

MORE FROM AUTHOR

RELATED ARTICLES