మానవా.. ఇక సెలవు...శ్రీదేవి అంత్యక్రియలు పూర్తి

మానవా.. ఇక సెలవు...శ్రీదేవి అంత్యక్రియలు పూర్తి
x
Highlights

వచ్చింది.. మెరిసింది. నవ్వింది.. నటించింది. అందాలను ఒలికించింది.. కుర్రకారు హృదయాలను కొట్టగొట్టింది. అమాయకత్వపు నటనతో ఒలలాడించింది. కోట్లాది...

వచ్చింది.. మెరిసింది. నవ్వింది.. నటించింది. అందాలను ఒలికించింది.. కుర్రకారు హృదయాలను కొట్టగొట్టింది. అమాయకత్వపు నటనతో ఒలలాడించింది. కోట్లాది అభిమానులను సొంతం చేసుకుంది. అతిలోక సుందరిగా వారి మదిలో చెరగని స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక సెలవంటూ.. ఈ లోకం విడిచివెళ్లింది. ఎక్కడో తమిళనాడులోని శివకాశిలో పుట్టిన శ్రీదేవి.. చివరకు ముంబైలో తన ప్రస్తానాన్ని ముగించింది.

సముద్ర అలల ఘోషతో.. నిత్యం గంభీరంగా ఉండే ముంబై తీరం.. గత నాలుగు రోజులుగా విషాదంలో మునిగిపోయింది. తన నవ్వులతో వెండితెరను శాసించిన అందాల తార శ్రీదేవి లేదన్న వార్తతో.. ఆమె అభిమానులతో పాటు.. యావత్ సినీ లోకమే కన్నీరు కార్చింది.

తన మేనల్లుడి పెళ్లి వేడుకకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడి నుంచే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. మూడు రోజుల తతంగం తర్వాత ఎట్టకేలకు దుబాయ్ పోలీసులు ఆమె భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో మంగళవారం రాత్రికి ముంబైలోని లోకండ్ వాలా గ్రీన్ ఎకర్స్ లోని నివాసానికి చేరుకుంది. అప్పటికే వేలాదిగా చేరుకున్న ఆమె అభిమానులు శ్రీదేవి రాక కోసం కోట్లాది కన్నులతో ఎదురుచూశారు.

ఇక బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అభిమానుల సందర్శనార్థం శ్రీదేవి భౌతికకాయాన్ని సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో ఉంచారు. లక్షలాదిగా తరలివచ్చిన అభిమానలోకం కదల్లేని, నవ్వలేని, నటించలేని తమ అభిమాన తారను చూసి కన్నీరు పెట్టుకుంది. సినీ ప్రముఖులంతా ఆమెతో తమకున్న అనుభవాలను గుర్తుచేసుకుని విషాదంలో మునిగిపోయారు.

మరోవైపు కడసారి చూపు కోసం తారాలోకం కదలివచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమకు చెందిన ప్రముఖులతో పాటు బాలీవుడ్ కు చెందిన నటీనటులంతా శ్రీదేవికి ఘనంగా నివాళులు అర్పించారు. వీరితో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో లోకండ్ వాలా మొత్తం కిక్కిరిసిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అంతిమయాత్ర సమయంలో శ్రీదేవి కి చెందిన ఓ ఫోటో విడుదల చేశారు. పట్టుచీర ధరించి బంగారు ఆభరణాలతో పాటు నుదుట ఎర్రటి బొట్టుపెట్టుకున్న శ్రీదేవి నిండు సుమంగళిగా కనిపించింది. సాధారణంగా చనిపోయిన తర్వాత డెడ్ బాడీ కళావిహీనంగా మారుతుంది. గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంటుంది. అయితే మంగళవారం సాయంత్రం దుబాయ్ లో శ్రీదేవి డెడ్ బాడీకి ఎంబామింగ్ చేశారు. దీంతో ఆమె ముఖం.. మళ్లీ కళకళలాడింది. వెండితెరపై ఆనాటి శ్రీదేవిని శ్రీదేవి అంటే అందంగా కనిపించాలి. అది ఆఖరు చూపైనా..

లక్షలాదిగా అభిమానులు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు వెంటరాగా.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అంతిమయాత్ర ప్రారంభమైంది. సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి.. విలే పార్లే సేవా సమాజ్ హిందూ స్మశాన వాటికకు ఆఖరుయాత్ర సాగింది. అభిమానుల అశ్రునయనాల మధ్య 7 కిలోమీటర్లకు పైగా ముంబై రోడ్లపై అంతిమయాత్ర కొనసాగింది.

అయితే తన అంతిమయాత్రకు సంబంధించి.. అంతా తెలుపురంగులో ఉండాలన్నది తన ఆకాంక్షని.. శ్రీదేవి ఒకానొక సందర్భంలో అన్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకే ఆమె కోరిక మేరకే అంతిమయాత్రకు ఉపయోగించిన వాహనం మొత్తం.. వివిధ రకాల తెల్లపూలతో అలంకరించారు. వాహనం లోపల శ్రీదేవి చిత్రపటాన్ని పెట్టారు. చిత్రపటం చుట్టూ.. అల్లిన తెల్లపూలను అలంకరించారు. వాహనాన్ని పూలతో అలంకరిస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

ఇక విలేలోని పార్లే సేవా సమాజ్ హిందూ స్మశాన వాటికలో శ్రీదేవి భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. సంతాప సూచకంగా గాల్లోకి బుల్లెట్లను పేల్చారు. ఆమె భర్త.. శ్రీదేవి చితికి నిప్పంటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories