హోదా మా పరిధిలో లేదు..

హోదా మా పరిధిలో లేదు..
x
Highlights

ప్రత్యేక హోదా విషయంలో ఇన్నాళ్లూ కేంద్రం చేస్తున్న వాదనలో పస లేదని తేలిపోయింది. హోదాకు 14 వ ఆర్థిక సంఘమే అడ్డు అంటూ కేంద్రం చెబుతున్న దాంట్లో వాస్తవం...

ప్రత్యేక హోదా విషయంలో ఇన్నాళ్లూ కేంద్రం చేస్తున్న వాదనలో పస లేదని తేలిపోయింది. హోదాకు 14 వ ఆర్థిక సంఘమే అడ్డు అంటూ కేంద్రం చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని స్పష్టమైంది. అసలు హోదాకు, ఆర్థిక సంఘం నియమ నిబంధనలకు సంబంధమే లేదని కుండబద్దలు కొట్టారు 15 వ ఆర్థిక సంఘం ఛైర్మెన్‌ ఎన్‌ కే సింగ్‌. హోదా అన్నది కేవలం రాజకీయ అంశమని వెల్లడించారు.

ఏపీ రాష్ట్ర వాస్తవ పరిస్థితులను.. ముఖ్యమంత్రి చంద్రబాబు 15 వ ఆర్థిక సంఘం సభ్యులకు కూలంకషంగా వివరించారు. నాలుగేళ్ల శిశువుగా ఉన్న ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే అని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రంలో ఓ బావోద్వేగ అంశంగా మారిందన్నారు. రాజకీయాలు కామన్‌ మెన్‌కు ఉపయోగపడేలా ఉండాలన్న చంద్రబాబు రాష్ట్రం అభివృద్ధి చెందితే అది దేశాభివృద్ధిలో భాగమే అన్నారు.

అశాస్త్రీయంగా విభజన జరిగితే కలిగే నష్టమేంటో ఏపీని చూస్తే తెలుస్తుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే మరో 20 యేళ్లు పడుతుందని దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయం తక్కువున్నది కేవలం ఏపీలోనే అని వివరించారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు మొత్తం 18 అంశాలను వివరిస్తూ అమలు చేయాలని కేంద్రానికి సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ప్రత్యేక హోదా అంశంపై 15 వ ఆర్థిక సంఘం ఛైర్మెన్‌ ఎన్‌ కే సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గతంలో విభజన చట్టాల అమలుకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉండేదని.. కానీ ఏపీ విభజన చట్టానికి పర్యవేక్షక వ్యవస్థ అనేదే లేదన్నారు. అయితే హోదా విషయంలో కేంద్రం చెబుతున్న కారణాలపై తాను మాట్లాడలేనన్న ఎన్‌ కే సింగ్‌.. పార్లమెంట్‌లో హామీ ఇచ్చిన ఈ అంశంపై తాము ఎంతమేర పరిశీలించే అవకాశం ఉందో ఆలోచిస్తామని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories