కేసీఆర్‌.. మూడక్షరాల సక్సెస్‌ మంత్ర

కేసీఆర్‌.. మూడక్షరాల సక్సెస్‌ మంత్ర
x
Highlights

64 ఏళ్ల వయస్సు.. 46 ఏళ్ల రాజకీయం.. 35 యేళ్లుగా చట్ట సభల్లో ప్రాతినిధ్యం.. 13 యేళ్ల ఉద్యమం.. నాలుగున్నరేళ్ల ముఖ్యమంత్రి పీఠం.. కేసీఆర్‌ అంటే బ్రీఫ్‌గా...

64 ఏళ్ల వయస్సు.. 46 ఏళ్ల రాజకీయం.. 35 యేళ్లుగా చట్ట సభల్లో ప్రాతినిధ్యం.. 13 యేళ్ల ఉద్యమం.. నాలుగున్నరేళ్ల ముఖ్యమంత్రి పీఠం.. కేసీఆర్‌ అంటే బ్రీఫ్‌గా చెప్పాలంటే ఇంతే. అంకెల్లో చెప్పడం సులువే.. కానీ ఆయన ప్రస్థానాన్ని వివరించడం అంటే అదో చరిత్ర. కేసీఆర్‌ ప్రస్థానంపై ప్రత్యేక కథనం.

కేసీఆర్‌.. మూడక్షరాల సక్సెస్‌ మంత్ర
కేసీఆర్‌.. ఉద్యమ ధీర
కేసీఆర్‌.. కలియుగ చాణక్య
కేసీఆర్‌.. గెలుపు ఐకాన్‌
కేసీఆర్‌.. యునిక్‌ లీడర్‌
కేసీఆర్‌.. తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌
కేసీఆర్.. సెకండ్ టైమ్‌ సీఎం

ఆరంభించరు నీచమానవుల్ అంటూ సాగే పద్యాన్ని ఎప్పుడూ కంఠతా పలికే కేసీఆర్‌ తన జీవితాన్ని అలాగే మలుచుకున్నారు. మొదలుపెట్టిన ఏ పనినైనా ఉత్తములు పూర్తి చేసి తీరుతారు. తాను కూడా అదే జాతికి చెందినవాడిగా చెప్పుకుంటారు. చెప్పడమే కాదు ఆచరణలో చేసి నిరూపించారు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు.

రాజకీయాల్లో ఉద్యమ పంథాను అనుసరించిన నాయకుడు.. కేసీఆర్‌. 2001 లో టీఆర్ఎస్ ను స్థాపించిన నాటి నుంచి ఇప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన సాగించిన రాజకీయ ప్రస్థానం ఓ చరిత్ర. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆయన వేసిన అడుగులు నాలుగున్నరేళ్ల క్రితమే లక్ష్యాన్ని ముద్దాడాయి. 13 యేళ్ల పాటు ఒకే లక్ష్యం కోసం పోరాడి కోట్ల మంది కలలను సాకారం చేసిన యోధుడు కేసీఆర్.

ప్రపంచ చరిత్రలో మహా మహులకు, యోధాను యోధులకు కొదువ లేదు. దేశ విదేశాల్లో గొప్ప గొప్ప నాయకులూ చాలానే ఉన్నారు. అలాంటి వారి సరసన నిలబడతారు కేసీఆర్‌. అనుకున్న లక్ష్యం కోసం ప్రాణాలొడ్డైనా దాన్ని సాధించే వరకు విశ్రమించని ధీరుడు.. కేసీఆర్‌.

ప్రత్యేక తెలంగాణ సాధించాలనే సంకల్పం తీసుకున్నప్పుడు కేసీఆర్ ఒక్కడే. ఆ తర్వాత ఆయన వెంట నడిచిన వారు చాలానే. మేథావులు, సామాజిక ఉద్యమ కారులు, సాధారణ ప్రజలంతా ఆయన అడుగులో అడుగేశారు. ఉద్యమం ద్వారానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పారు. ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్‌లైన్‌తో ముందుకు నడిచారు. తెలంగాణ గురించి పూర్తిగా అవలోకనం చేసుకున్న కేసీఆర్‌ గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాయిస్‌ వినిపించారు. తన వెంట ఎవరున్నా లేకున్నా ఆయన అడుగు ముందుకే పడింది. తనను ఎవరూ నమ్మని రోజుల్లో కూడా కేసీఆర్‌ తన లక్ష్యం కోసమే పోరాడారు.

2009 లో ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. నవంబర్‌ చివరివారంలో ఆయన చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ చరిత్రలో చెరగిపోని సంతకం. ఆనాటి తర్వాత మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. సకల జనుల సమ్మెతో ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకొచ్చారు. ఎట్టకేలకు 2014 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రీ ఆర్గనైజేషన్‌ బిల్లును ప్రవేశపెట్టింది. ఉమ్మడి రాష్ట్రాన్ని రెండుగా మార్చింది. తెలంగాణ అవతరించింది. కోట్లాది ప్రజల కల నెరవేరింది.

కేసీఆర్‌కు ఎన్నికలు కొత్త కాదు. ఎలక్షన్స్‌ ఎప్పుడొచ్చినా గెలుపు ఆయన ఖాతాలోకే. ప్రత్యర్థల బలహీనతలను తన విజయానికి మార్గాలుగా మార్చుకుంటారు. వారిని ఎదుర్కోవడంలో కేసీఆర్‌ చూపించే తెగువ ప్రశంసనీయం. తన మాటలతో ప్రజలను మంత్రముగ్ధులను చేయడంలో ధిట్ట. ఆయన మాటలు మనలో ఒకడిగా మాట్లాడినట్లే ఉండేవి. అలా ఆయన ఇప్పటివరకు 8 సార్లు ఎమ్మెల్యేగా ఐదు సార్లు ఎంపీగా గెలుపొందారు. 1983 లో సిద్ధిపేట నుంచి తొలిసారి పోటీ చేసి ఓటమి చవిచూసిన కేసీఆర్‌ ఆ తర్వాత అపజయమే లేకుండా దూసుకుపోయారు. 2014 లో టీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన కేసీఆర్‌ ఆరు నెలల ముందే ప్రజల ముందుకు వెళ్లారు. మరో అద్భుత విజయాన్ని ఆయన సొంతం చేసుకున్నారు.

ఇక కేసీఆర్‌ లక్ష్యం దేశరాజకీయాలను మార్చడమే. ఉమ్మడి జాబితాలోని అంశాలను రాష్ట్రాలకు బదిలీ చేయడమే. ఫెడరల్‌ ఫ్రంట్‌ ను అధికారంలోకి తీసుకొస్తానని చెప్పిన ఆయన ఇక ముందు అటువైపే అడుగులు వేయనున్నారు. అందుకు ఢిల్లీ కేంద్రంగా కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కేసీఆర్‌ మరో పనిని మొదలుపెట్టారు. దాన్ని పరిపూర్ణం చేయడమే ఆయన ముందున్న లక్ష్యం. అది నెరవేరాలని ఆకాంక్షించడమే తెలంగాణ ప్రజల కర్తవ్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories