కన్నాపైనే ఎందుకు?

x
Highlights

మొన్నటికి మొన్న అనంతపురం ఘటన మరువకముందే నిన్న దాదాపు అదే సీన్ నెల్లూరులో రిపీట్ అయ్యింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాపై వరుస దాడులు ఎందుకు...

మొన్నటికి మొన్న అనంతపురం ఘటన మరువకముందే నిన్న దాదాపు అదే సీన్ నెల్లూరులో రిపీట్ అయ్యింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాపై వరుస దాడులు ఎందుకు జరుగుతున్నాయ్ కన్నాను టార్గెట్ చేశారా.? ఆయన ఎక్కడికెళ్లినా ఇంతేనా.? టీడీపీయే దాడులు చేయిస్తోందన్న బీజేపీ ఆరోపణల్లో నిజమెంత.?

నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. కావలిలో నిర్వహిస్తున్న బీజేపీ ర్యాలీలో పాల్గొన్న కన్నాపై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, కన్నాపై చెప్పు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తి పేరు గొర్రెపాటి ఉమామహేశ్వరరావుగా, అతని స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరుగా గుర్తించారు. దాడి జరిగిన సమయంలో బీజేపీ నేతలు టీడీపీ నేతలపై భగ్గుమన్నారు. దాడికి పాల్పడింది టీడీపీ కార్యకర్తే అని ఆరోపిస్తూ ఉమామహేశ్వరరావును చితకబాదారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

కన్నాపై చెప్పు విసిరిన ఘటనపై నిందితుడు ఉమా మహేశ్వరరావును అడగ్గా నరేంద్ర మోడీపై తనకున్న కోపం కారణంగానే బీజేపీ నాయకుడైన కన్నా లక్ష్మీనారాయణపై చెప్పు విసిరానని చెప్పాడు. తన వెనుక ఎవరి ప్రోద్బలం లేదని స్పష్టం చేశాడు.
కన్నా లక్ష్మీనారాయణపై జరుగుతున్న దాడులు టీడీపీయే చేయిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న దాడుల వెనుక చంద్రబాబు ప్రోద్బలం ఉందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ఐతే బీజేపీ ఆరోపణలను టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తప్పుపట్టారు. దాడి చేసిన వ్యక్తికి టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రజల్లో బీజేపీపై ఉన్న వ్యతిరేకత వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని రవిచంద్ర తెలిపారు.

ఇదిలా ఉంటే వారం క్రితం అనంతపురం పర్యటనకు వెళ్లిన కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ నాయకులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆయన బస చేసిన ఆర్ అండ్ బీ అతిథి గృహంలోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో బీజేపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. మొన్న అనంతపురం ఇప్పుడు నెల్లూరు కావలిలో జరిగిన దాడులు కచ్చితంగా టీడీపీ ప్రభుత్వమే చేయించిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. లేకపోతే సామాన్య జనం దాడులు ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories