సిరాజ్‌.... హైదరాబాదీ బుల్లెట్‌!!

సిరాజ్‌.... హైదరాబాదీ బుల్లెట్‌!!
x
Highlights

వెస్టిండీస్‌తో జరిగే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో హైదరాబాద్ యువఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ చోటు సంపాదించాడు. అలనాటి మీడియం పేసర్...

వెస్టిండీస్‌తో జరిగే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో హైదరాబాద్ యువఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ చోటు సంపాదించాడు. అలనాటి మీడియం పేసర్ మహ్మద్ అబీద్ అలీ తర్వాత... టెస్ట్ సిరీస్ కు ఎంపికైన హైదరాబాద్ పేస్ బౌలర్ గా సిరాజ్ రికార్డుల్లో చేరాడు. ఆటో డ్రైవర్ కొడుకు నుంచి టీమిండియా ఫాస్ట్ బౌలర్ స్థాయికి ఎదిగిన 24 ఏళ్ల హైదరాబాదీ బుల్లెట్ సిరాజ్‌.

ప్రపంచ క్రికెట్ మూలవిరాట్టు భారత్ లో....ఫాస్ట్ బౌలర్ల గాలి వీస్తోంది. ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్ లాంటి సీనియర్ ఫాస్ట్ బౌలర్లకు... నవతరం ఫాస్ట్ బౌలర్లు...మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్ పక్కలో బల్లెంలా మారారు. టెస్ట్ క్రికెట్ ఎనిమిదో ర్యాంకర్ వెస్టిండీస్ తో అక్టోబర్ 4 నుంచి ప్రారంభమయ్యే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో పాల్గొనే...15మంది సభ్యుల భారతజట్టులో....హైదరాబాదీ యువఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ చోటు సంపాదించడం ద్వారా వారేవ్వా! అనిపించుకొన్నాడు.

దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ...హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ గా గుర్తింపు తెచ్చుకొన్న...24 ఏళ్ల సిరాజ్ కు...140 కిలోమీటర్ల వేగానికి స్వింగ్ ను జోడించి...బౌలింగ్ చేసే సత్తా ఉంది. ఐపీఎల్ గత రెండుసీజన్లతో పాటు...ఇండియా-ఏ జట్టు తరపున సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన మ్యాచ్ ల్లో అసాధారణంగా రాణించడం ద్వారా...సిరాజ్...సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ కుటుంబానికి చెందిన సిరాజ్...అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ఐపీఎల్ గత రెండుసీజన్లలో ...హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టులో సభ్యుడిగా సత్తాచాటుకొన్న సిరాజ్...భారత టీ-20 జట్టులో సైతం చోటు సంపాదించాడు. అంతేకాదు..2017లో న్యూజిలాండ్ పై టీ-20 అరంగేట్రం చేసిన సిరాజ్...మూడు వేర్వేరుదేశాలపై మూడు మ్యాచ్ లు ఆడి...3 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీల విలువైన సలహాలు, సూచనలతో తన బౌలింగ్ ఎంతగానో మెరుగుపడిందని...టెస్టు జట్టులో సైతం చోటు దక్కడం తనకు గర్వకారణమంటూ సిరాజ్ పొంగిపోతున్నాడు.

హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు సిరాజ్ ను ....2 కోట్ల 60 లక్షల రూపాయల ధరకు సొంతం చేసుకొంది. 20 లక్షల రూపాయల కనీస వేలం ధరతో...మొదలైన పాట...చివరకు 2 కోట్ల 60 లక్షల రూపాయల వరకూ వచ్చి ఆగింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన సిరాజ్ తండ్రి ఆటోడ్రైవర్,... తల్లి పాచిపనులుచేస్తూ ఇంతకాలమూ.. తమ కుటుంబాన్ని పోషించుకొంటూ వస్తున్నారు. అయితే....క్రికెట్ సంపాదనతోనే...ఇప్పటికే అమ్మను పని మాన్పించిన సిరాజ్...తనతండ్రి కష్టం , ప్రోత్సాహం కారణంగానే తాను ఈస్థితికి వచ్చానని పొంగిపోతున్నాడు. సిరాజ్ కు టెస్ట్ క్యాప్ దక్కాలని...అందివచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని...తెలుగు రాష్ట్రాలు, ప్రధానంగా హైదరాబాద్ క్రికెట్ కే గర్వకారణంగా నిలవాలని కోరుకొందాం..

Show Full Article
Print Article
Next Story
More Stories