నివురుగప్పిన నిప్పులా అయోధ్య!

నివురుగప్పిన నిప్పులా అయోధ్య!
x
Highlights

రామమందిరం నిర్మాణం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే లక్ష్యంతో అయోధ్యలో ఇవాళ హిందూ సంస్థలు ధర్మసభను నిర్వహిస్తున్నాయి. 3 రోజుల పాటు జరగనున్న సభల కోసం...

రామమందిరం నిర్మాణం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే లక్ష్యంతో అయోధ్యలో ఇవాళ హిందూ సంస్థలు ధర్మసభను నిర్వహిస్తున్నాయి. 3 రోజుల పాటు జరగనున్న సభల కోసం లక్షలాదిగా రామ భక్తులు తరలివస్తున్నారు. సుమారు 3 లక్షల మందితో ధర్మసభను నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సున్నితమైన అంశం కావడంతో.. భారీగా బలగాలు మోహరించాయి. 700 మంది పోలీసులు, 42 కంపెనీల పీఏసీ బలగాలు, 5 కంపెనీల ఆర్‌ఏఎఫ్‌, ఏటీఎస్‌ కమాండోలను, డ్రోన్లను మోహరించారు. వివాదాస్పద ప్రదేశం పరిసరాల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తామని యూపీ అదనపు డీఐజీ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. అయోధ్యలో 144 వ సెక్షన్‌ కొనసాగుతుందని వెల్లడించారు.

ఇటు ఇప్పటికే శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రే అయోధ్యకు చేరుకున్నారు. రామమందిరాన్ని ఎప్పుడు నిర్మిస్తారో తేదీ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్రంతో పాటు.. 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా ఇంకా రామమందిరం నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదని ఉద్దవ్‌ ప్రశ్నిస్తున్నారు. మందిరం నిర్మాణానికి చట్టం తేవాలని.. లేకపోతే ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. కోర్టు తీర్పుకు ముందే చట్టం చేయాలని కోరారు. అయితే ధర్మసభతో సంబంధం లేకుండా తాను ఆలయ దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య వచ్చినట్లు.. ఉద్దవ్‌ ఠాక్రే తెలిపారు.

ఇక ఈ వ్యవహారంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని అలీగఢ్‌ వర్సిటీ విద్యార్థి సంఘం డిమాండ్‌ చేసింది. అయోధ్యలో ముస్లింలు భయపడి పోతున్నారని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ అంశాన్ని లేవనెత్తారంటూ బీఎస్పీ అధినేత మాయావతి ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే అయోధ్యలో సైన్యాన్ని మోహరించాలని సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్‌ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories