తంత్రమా..రాజకీయ తంత్రమా?

x
Highlights

తాంత్రిక పద ప్రయోగం రాజకీయాలకు కొత్తేమీ కాదు. లక్కీ నెంబర్లు, వాస్తుపూజలకు అసలు లెక్కే లేదు. భూత ప్రేత పిశాచాలను పిలిచి శత్రువులపై ప్రయోగించే తంత్ర...

తాంత్రిక పద ప్రయోగం రాజకీయాలకు కొత్తేమీ కాదు. లక్కీ నెంబర్లు, వాస్తుపూజలకు అసలు లెక్కే లేదు.
భూత ప్రేత పిశాచాలను పిలిచి శత్రువులపై ప్రయోగించే తంత్ర పూజలకైతే అంతు లేదు. చీకటి శక్తులను వశం చేసుకునే సులభ ప్రయోగమే తాంత్రికం. ఉన్నత పదవుల కోసం ఆశపడే వారు చేసే ప్రయత్నం. అసలు ఏంటీ తాంత్రికం.? రాజకీయాలకు, తంత్రపూజలకు లింక్‌ ఉంటుందా అసలు? మాజీ ప్రధాని పీవీ హయాంలో వెలుగు వెలిగిన చంద్రస్వామి నుంచి నిన్నా మొన్నటి దుర్గమ్మ గుడిపై జరిగిన తాంత్రిక కోణాల కథేంటి?

చంద్రస్వామి. రెండున్నర దశాబ్దాల కింద ఓ వెలుగు వెలిగిన తాంత్రికవిలుకాడు. మాఫియా కింగ్స్‌ నుంచి దేశాధినేతల దాకా అంతా ఆయన్ను ప్రసన్నం చేసుకోవాలని ఆరాటపడేవారు. తాంత్రిక విద్యలో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న ఆయన దర్శనం కోసం వారు తాపత్రయపడేవారు. ఇద్దరు ప్రధానులు పీవీ నరసింహారావు, చంద్రశేఖర్‌‌లతో అత్యంత సన్నిహిత్యంగా మెలిగిన చంద్రస్వామి తాంత్రిక విద్యలతో ఇద్దరిని తిరుగులేని రాజకీయ నాయకులుగా నిలబెట్టారని అప్పట్లో విపరీతమైన ప్రచారం జరిగింది. అలా చంద్రస్వామి పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.

పీవీ నరసింహారావు, చంద్రశేఖరే కాదు బ్రిటీష్ ప్రధానిలు కూడా చంద్రస్వామి శిష్యుల జాబితాలో చేరిపోయారు. బ్రిటీష్ మాజీ ప్రధాని మార్గరేట్ థాచర్, బ్రూనై సుల్తాన్‌లు చంద్రస్వామి వద్ద సలహాలు స్వీకరించారని చెప్పుకుంటారు. థాచర్ కార్యాలయానికి చంద్రస్వామి వెళ్లడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. మరో నాలుగేళ్లలో ఆమె ప్రధాని అవుతారని, పదేళ్ల పాటు పదవిలో ఉంటారని ఆయన జోస్యం చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే థాచర్ అధికారంలోకి వచ్చింది. ఇక బ్రూనై సుల్తాన్ చంద్రస్వామి వద్ద సలహాలు స్వీకరించినవారే. అలా చంద్రస్వామి జ్యోతిష్యంపై ప్రముఖుల్లో విశ్వాసం బలపడింది. ఆయన్ను చాలామందికి దగ్గర చేసింది.

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సహా హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్ ఇలా చాలామంది ఆయన సలహాల కోసం సంప్రదించేవారు. ఎక్కడికెళ్లినా ప్రముఖులతో నీరజనాలు అందుకున్న చంద్రస్వామి.. దుష్టశక్తులను దూరంగా తరిమేందుకు నర్సింహ కవచ, గార్దబ ప్రయోగ, మనుష్యుక్త పారాయణ తదితర పూజాది కార్యక్రమాలు, హోమాలు నిర్వహించారని అప్పట్లో మీద రకరకాలు ఊహాగానాలు వినిపించాయి. జ్యోతిష్యంలో నైపుణ్యం ఉండటం, ఆయన హావభావాలు అచ్చమైన తాంత్రికుడిలా కనిపిస్తుండేసరికి మహామహులుగా పేరు తెచ్చుకున్న వారు చంద్రస్వామి అనుగ్రహం కోసం క్యూ కట్టేవారు. పీవి హయాంలోనే ఎక్కువగా ఫోకస్ అయిన చంద్రస్వామి పీవీ మరణం తర్వాత కనుమరుగయ్యారు.

దుర్గ గుడిలో ఏం జరిగిందన్న దానిపై ఎవరి వాదన వారిది. శాంతస్వరూపణి ఆలయంలో అర్థరాత్రి పూజలపై దుమారం రేగుతోంది. ఏపీ మంత్రి లోకేష్‌ కోసమే తాంత్రిక పూజలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ్‌. పూజలు జరిగితే అంత రహస్యం ఎందుకు? చేసేవి మంచి పూజలే అయితే అర్థరాత్రి చేయడంలో ఆంతర్యమేంటి? ఇవన్నీ కాస్త పక్కన పెడితే లోకేష్‌ ఇష్యూ తెరపైకి రావడంతో రాజకీయానికి, తాంత్రికానికి లింకుపై మాట్లాడుకోవాలి.

ఒక పీవీ, ఒక ఎన్టీఆర్‌, ఒక జయలలిత, ఒక దేవెగౌడ ఇవి పైకి కనిపించే పేర్లే అందరికీ వినిపించే పేర్లే. ఈ తాంత్రిక పద్ధతిలో పూజించి, కోరిన కోర్కెలు సిద్ధింపజేసుకునే ప్రయత్నం వీళ్లంతా చేసుకున్నదే. 1991 నుంచి 1995 వరకు సంకీర్ణ సర్కార్‌ను కింగ్‌లా నడిపించిన పీవీ తాంత్రిక పూజలు చేయించారని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. అందుకు చంద్రస్వామిలాంటి వివాదాస్పద తాంత్రికస్వామి సహాయం తీసుకున్నారని నాటి విపక్షాలు కోడై కూశాయి కూడా.

అంతెందుకు ఎన్టీఆర్‌పైనా ఇలాంటి విమర్శలు గుప్పుమన్నాయి. ముఖ్యమంత్రి కావడం కోసం, అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం వామాచార, అధార్మిక, క్షుద్ర పూజలు చేయించారని అప్పట్లో ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి కావాలంటే ఓ పడచు అమ్మాయి శవానికి పూజలు చేయాలని ఎవరో తాంత్రికవేత్త చెప్పారని, దాన్ని తూచా తప్పకుండా ఎన్టీఆర్‌ పాటించారన్న విమర్శలు వినిపించాయ్‌ అప్పట్లో. తమిళనాడు మాజీ సీఎం జయలలిత కూడా ఇలాంటి పూజలు చేయించిందీ అనే పుకార్లు చాలానే వినిపించాయ్. అధికార సుస్థిరత కోసం, కోర్కెల సాధన కోసం శక్తి ఆరాధనే తాంత్రికవేత్తలు క్షుద్రపూజలుగా నామకరణం చేశారని చెప్పుకుంటారు.

స్మార్త, శైవ, వైష్ణవ ఆగమం. ఇది శాస్త్రం ప్రకారం జరిగే పూజావిధానం. కానీ శక్తి స్వరూపిణులను ఆరాధించడం బలుల విధానమన్న నానుడి పల్లెల్లో ఇప్పటికీ బలంగా వినిపిస్తూనే ఉంటుంది. మనకు కనిపిస్తూనే ఉంటుంది. క్షుద్రపూజలు, తాంత్రికపూజలు అని పిలవబడుతున్న పూజలకన్నా శివుడి ఆరాధకులు అఘోరాల పూజాపద్ధతులు మరీ భయంకరంగా ఉంటాయి. పూజలు ముఖ్యం కానీ పూజా పద్ధతులు ముఖ్యం కాదన్న మాటలు రాజకీయ తాంత్రిక కోణంలో వినిపిస్తాయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories