అవిశ్వాల తీర్మానాల వెనుక దాగివున్న నిజం తెలిస్తే నివ్వెరపోవాల్సిందే

x
Highlights

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల రాజకీయం రంజుగా సాగుతోంది. ఎక్కడ చూసినా అవిశ్వాసంపై గొడవలే. ఎంపీపీ పదవుల కోసం కొందరు, తమ వారిని ఆ కుర్చీల్లో...

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల రాజకీయం రంజుగా సాగుతోంది. ఎక్కడ చూసినా అవిశ్వాసంపై గొడవలే. ఎంపీపీ పదవుల కోసం కొందరు, తమ వారిని ఆ కుర్చీల్లో కూర్చోబెట్టేందుకు మరికొందరు అవిశ్వాస రాజకీయాలకు తెరలేపుతున్నారు. అసలు అవిశ్వాసం వెనుక ఉన్న నిజమేంటి? ఆ కూర్చీకోసం డబ్బులు చేతులు మారుతున్నాయా?

అవిశ్వాసం పేరుతో సాగే కుర్చీలాట ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. సాధారణ ఎన్నికలను తలపించేలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని స్థానిక సంస్థల రగడ జరుగుతోంది. ఎక్కడ చూసినా అవిశ్వాసమంటూ రచ్చ అవుతోంది. ఎంపీపీ పదవుల నుంచి మొదలుపెడితే రామగుండం మేయర్ పదవుల దాకా అంతా అదే పరిస్థితి నెలకొంది.

అయితే, ఈ అవిశ్వాల తీర్మానాల వెనుక దాగివున్న నిజం తెలిస్తే నివ్వెరపోవాల్సిందే. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో ఎంపీపీకీ, ఎంపీటీసీలకు మధ్య జరిగిన అగ్రిమెంట్ వ్యవహారం తెలిస్తే షాక్ తినాల్సిందే. తనపై అవిశ్వాసం పెట్టొద్దంటూ ఎంపీపీ తొట్ల నర్సు స్థానిక ఎంపీటీలతో ఎన్నికల సమయంలో డీల్ కుదుర్చుకున్నారు. అందుకు ఒక్కొక్కరికీ 4లక్షల రూపాయలు ఇచ్చారు. ఒకవేళ అవిశ్వాసం పెడితే 4లక్షలకు బదులు 20లక్షలు తిరిగి ఇవ్వాలని వారితో అగ్రిమెంట్ చేయించుకున్నారు. అయితే, ఇప్పుడు ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టడంతో వారి డీల్‌పై రచ్చ మొదలైంది.

కథలాపూర్ మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలుంటే అందులో బీజేపీ -5, టీఆర్‌ఎస్-5, కాంగ్రెస్ -3 స్థానాల్లో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పోతారం ఎంపీటీసీ తొట్ల నర్సు ఎంపీపీ పదవికి పోటీకి దిగగా, బీజేపీ ఎంపీటీలను ఆమె మద్దతు కోరారు. దీంతో బీజేపీకి చెందిన ఎంపీటీసీ సౌజన్య భర్త గంగాధర్ ఐదేళ్లపాటు ఎంపీపీకి మద్దతు తెలిపేందుకు 4లక్షల రూపాయలకు మే 14 2014న బాండ్ పేపర్‌పై రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, సౌజన్య ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఫిరాయించడంతో అవిశ్వాసానికి జైకొట్టింది.

అధికార పార్టీ కుట్రలు చేస్తోందని, అవిశ్వాసం పెట్టించి మండల పరిషత్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. తాము రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యామని, న్యాయం కోసం పోరాటం చేస్తామని చెబుతున్నారు. మరోవైపు అవిశ్వాస తీర్మానం పెట్టినందుకు తమ ఒప్పందం ప్రకారం 20లక్షలు చెల్లించాలని ఎంపీటీసీ సౌజన్య, ఆమె భర్త గంగాధర్‌ను ఎంపీపీ వర్గం నిలదీస్తోంది. ఆ డబ్బులతో అదే గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని వారు చెబుతున్నారు.

అయితే, ఒక్క ఎంపీపీ పదవికోసం ఎంపీటీసీలకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చుపెట్టిన వ్యవహారం బయటపడటంతో జనం ఖంగుతింటున్నారు. అవిశ్వాస తీర్మానాల వెనుక దాగిన రహస్యం తెలిసి షాక్ అవుతున్నారు. మరి రామగుండం మేయర్‌ విషయంలోనూ. వేములవాడ మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసంపైనా ఆయా ప్రాంతాల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎంత మొత్తం అంది ఉంటుందన్నదానిపై ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories