తెలంగాణలో పంచాయతీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ

తెలంగాణలో పంచాయతీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
x
Highlights

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 61% రిజర్వేషన్లకు అమలు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ...

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 61% రిజర్వేషన్లకు అమలు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో పిటిషన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల కేటాయింపు గరిష్ఠంగా 50 శాతానికి మించడానికి వీల్లేదని ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ రోహింగ్టన్‌ నారీమన్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో బీసీల జనాభా పెరిగింది కనుక రిజర్వేషన్లు 50 శాతం కన్నా ఎక్కువ పెంచుకొనే అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది నీరజ్‌ కిషన్‌ కౌల్‌ వాదనలు వినిపించారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు 7 శాతం కలిపి 61 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కోర్టుకు తెలిపారు. తెలంగాణలో బీసీల జనాభా ఎక్కువ ఉండొచ్చు కానీ గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం కన్నా ఎక్కువ ఉండటానికి వీల్లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 50 శాతానికి లోబడే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు ఉండాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చింది మధ్యంతర ఉత్తర్వులే కాబట్టి మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని, సుప్రీంకోర్టులో పిటిషన్‌ ఉపసంహరించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. దీంతో పిటిషన్‌ కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories