ఈ రేయి మరచిపోలేనిది..

Submitted by arun on Sat, 04/07/2018 - 14:44
Salman Khan

తొలిరాత్రి.. మలిరాత్రి.. ఇంకెన్ని రాత్రులొస్తాయో కానీ.. భయటకు రావాలన్న సల్మాన్ కోరిక మాత్రం తీరడం లేదు. గురువారం తన జీవితంలో తొలిసారి చెరసాలకు వెళ్లిన సల్లూ భాయ్.. శుక్రవారం రాత్రి కూడా ఆ నాలుగు గోడల మధ్యే గడిపాల్సి వచ్చింది. 

 బాలీవుడ్ బ్యాచిలర్.. సిల్వర్ స్క్రీన్ బాయిజాన్.. హీరోయిన్లతో డేటింగ్‌లు, యాక్షన్, ప్యాకప్ ల మాటలు.. ఇలాంటివే తప్ప ఇంకేమీ ఎరుగని సల్మాన్ లైఫ్.. కొత్త టర్న్ తీసుకుంది. చెరసాలే అన్నీ అయిపోయింది. ఊచల వెనుకే రెండు రోజుల జీవితం గడిచిపోయింది. జైలు గోడలే ప్రపంచం అయిపోయింది. 

గురువారం రాత్రి భోజనం చేయకుండానే నిద్రపోయిన సల్మాన్.. శుక్రవారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ కూడా ముట్టుకోలేదు. ఉదయం కిచ్‌డీ, టీని అందజేయగా సల్మాన్‌ తిరస్కరించారని జైలు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం పప్పు, కూరగాయలు, చపాతీలతో కూడిన భోజనాన్ని ఆయన తీసుకున్నారని తెలిపారు. అయితే జైలు సిబ్బందిని అడిగి హిందీ పేపర్‌ లను తెప్పించుకుని చదివారని చెప్పారు. పక్క బ్యారక్‌లో ఉన్న ఆశారం బాపూను పలకరించినట్లు వెల్లడించారు. మరోవైపు ఖైదీలకు సంబంధించిన డ్రెస్  సిద్దం కాకపోవడంతో.. సల్మాన్ తన సొంత దుస్తులనే ధరిస్తున్నట్లు తెలిపారు. జైల్లోకి వచ్చినప్పుడు.. అధిక రక్తపోటుతో ఉన్న సల్మాన్.. తర్వాత కుదుటపడిందని.. అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సల్మాన్ వ్యాయామం చేసినట్లు వెల్లడించారు. 

మరోవైపు సల్మాన్ ఇద్దరు సోదరీమణులు అల్విరా, అర్పిత తో పాటు బాలీవుడ్ నటి ప్రీతీజింటాతో సల్మాన్ ను పరామర్శించారు. ఈ సమయంలో కాస్త భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. తొలుత మానసికంగా కుంగుబాటుకు గురైనట్లు కనిపించినా సాయంత్రం వరకు సల్మాన్  హుషారుగా మారినట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఇక రెండో రాత్రి కూడా సల్మాన్ కు నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి దాటాక కూడా మెలకువగానే ఉన్నట్లు జైలు అధికారులు వెల్లడించారు. 

English Title
Salman Khan spends second night in Jodhpur jail

MORE FROM AUTHOR

RELATED ARTICLES