రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం..

Submitted by arun on Sun, 11/04/2018 - 11:15
shabarimala temple

ఒక రోజు ఉత్సవం కోసం శబరిమల ఆలయం రేపు తెరుచుకోనుంది. దీంతో ఆలయపరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు ఐదు వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. సన్నిధానం, పంబ, నిలక్కల్‌ ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి సోమవారం అర్ధరాత్రి వరకూ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పతనంతిట్ట జిల్లా మేజిస్ట్రేట్‌ పిబి నూత్‌ ప్రకటించారు. 'చితిర అట్ట విశేషం' సందర్భంగా ఆలయాన్ని రేపు సాయంత్రం 5.30 గంటలకు తెరుస్తారు. అదే రోజు రాత్రి 10.30 గంటలకు మూసివేస్తారు.

ఆలయంలోకి వెళ్ళేందుకు అన్ని వయస్సుల మహిళలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో లోనికివెళ్ళేందుకు ప్రయత్నించిన మహిళలపై గత నెల 16, 17తేదీల్లో హిందూత్వశక్తులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్తతలను సృష్టించారు. భక్తులు, మీడియాను రేపు ఉదయం పూట అనుమతిస్తామని సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా వుందని ఆ తీర్పు అమలుకు కట్టుబడి ఉన్నామని పతనంతిట్ట పోలీసు ఉన్నతాధికారి నారాయణన్‌ తెలిపారు. భద్రత కల్పించమని ఎవరైనా మహిళలు కోరితే వారికి తప్పనిసరిగా రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. 

10 నుంచి 50 ఏళ్ల వయస్సుగల మహిళలను అడ్డుకునేందుకు పంబ ప్రాంతానికి వేలాది మంది నిరసనకారులు చేరుకునేందుకు సిద్ధమవుతున్నట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు భద్రతను కట్టుదిట్టంచేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. సన్నిధానంలో ఎక్కువ సమయం ఉండేందుకు, గుంపులు గుంపులుగా తిరిగేందుకు ఎవర్నీ అనుమతించబోమని తెలిపారు. నామజపంతో నిరసనలు తెలిపేందుకు 10 ఏళ్లలోపు చిన్నారులను హిందూత్వసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ సమీకరిస్తున్నట్టు సమాచారమందిందని పోలీసు అధికారి నారాయణన్‌ తెలిపారు.

English Title
Sabarimala temple reopens on Monday

MORE FROM AUTHOR

RELATED ARTICLES