ఆర్ ఎక్స్ 100 మూవీ రివ్యూ

Submitted by arun on Thu, 07/12/2018 - 11:22
rx100

టైటిల్ : ఆర్‌ఎక్స్‌ 100
జానర్ : రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌, రావు రమేష్, రాంకీ
సంగీతం : చైతన్‌ భరద్వాజ్‌
నేపథ్య సంగీతం : స్మరన్‌
దర్శకత్వం : అజయ్‌ భూపతి
నిర్మాత : అశోక్‌ రెడ్డి గుమ్మకొండ

టాలీవుడ్‌లో చిన్న చిత్రాలకు, విభిన్నమైన కథాంశంతో రూపొందే చిత్రాలకు ప్రేక్షకుల విశేష ఆదరణ లభించిన దాఖలాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే ఉన్నాయి. పెద్ద హీరో, భారీ బడ్జెట్ చిత్రాలనే తేడా లేకుండా కంటెంట్ ఉండే చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు సాక్ష్యంగా పెళ్లిచూపులు, మెంటల్ మదిలో, అర్జున్ రెడ్డి చిత్రాలు సాక్ష్యంగా నిలిచాయి. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన చిత్రం RX 100. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో, హీరోయిన్లుగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను సొంత చేసుకొన్న ఈచిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకొన్నదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ ; చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోయిన శివ(కార్తికేయ)ను డాడీ(రాంకీ) అన్ని తానే అయి పెంచుతాడు. డాడీకి చేదోడు వాదోడుగా ఉంటూ సరదాగా కాలం గడిపేస్తుంటాడు శివ. ఊళ్లో గొడవల కారణంగా డాడీకి , విశ్వనాథం(రావు రమేష్)తో గొడవలు అవుతాయి. కానీ అదే సమయంలో శివ, విశ్వనాథం కూతురు ఇందు(పాయల్ రాజ్‌పుత్‌)తో ప్రేమ పడతాడు. తన ప్రేమకు డాడీ సపోర్ట్ చేయటంతో శివ, ఇందుకు మరింత దగ్గరవుతాడు. ఒక రోజు మన ప్రేమ విషయం ఇంట్లో చెప్తానని శివకు చెప్పి వెళ్లిన ఇందు, తండ్రి చూసిన ఫారిన్ కుర్రాడిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. ఇందును తన నుంచి దూరం చేశాడని విశ్వనాథం మీద పగ పెంచుకుంటాడు శివ. విశ్వనాథం మనుషులను కొట్టడంతో పాటు, ఆస్తులను కూడా ధ్వంసం చేస్తూ సైకోలా తయారవుతాడు. అసలు ఇందు, శివను కాదని మరో పెళ్లి ఎందుకు చేసుకుంది..? వీరి ప్రేమకథలో విలన్‌ ఎవరు..? చివరకు శివ ఏమైయ్యాడు అన్నదే మిగతా కథ.

విశ్లేషణ ; దర్శకుడు అజయ్‌ భూపతి తన గురువు వర్మ లాగే ఒక వాస్తవిక కథను తెరపై చూపించడానికి ప్రయత్నించాడు. నిజ జీవితంలో జరిగిన కథ ఇది. అందుకే సినిమా కూడా వాస్తవిక కోణంలోనే సాగుతుంది. కథను చాలా నిదానంగా ప్రారంభించిన దర్శకుడు తొలి సన్నివేశాలతో కాస్త బోర్‌ కొట్టించాడు. కథానాయిక రాకతో కథ, కథనంలో ఉత్సాహం వస్తుంది. కథానాయిక పాత్ర బోల్డ్‌గా తీర్చిదిద్దాడు. హీరో, హీరోయిన్ల మధ్య సాగిన సుదీర్ఘమైన ముద్దు సన్నివేశాలు, శృంగారపరమైన సన్నివేశాలు చూస్తే ఈ సినిమాలు పెద్దలకు మాత్రమేనా? అనిపిస్తుంది.

దర్శకుడు ప్రతీ విషయాన్ని వివరించి చెప్పాలనుకున్నాడు. చాలా సందర్భాల్లో సన్నివేశాలను పచ్చిగా తీద్దామనుకున్నాడు. అందుకే అవన్నీ సుదీర్ఘంగా సాగి విసుగు తెప్పిస్తాయి. ద్వితీయార్థం చూస్తే ‘అర్జున్‌ రెడ్డి’ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కథానాయకుడు సైకోగా మాట్లాడుతున్నాడా? అన్న అనుమానం వస్తుంది. సినిమా మరో 20 నిమిషాల్లో ముగుస్తుందనగా ఊహించని మలుపులు ఇచ్చాడు దర్శకుడు. అక్కడి నుంచి కథ జోరందుకుంటుంది. పతాక సన్నివేశాలు మరింత రియలిస్టిక్‌గా తీర్చిదిద్ది ఈ కథను విషాదాంత కోణంలో ముగించాడు. ఓ విధంగా చెప్పాలంటే చివరి 20 నిమిషాలే ఈ కథను నడిపించాయి. వాటిని నమ్ముకునే దర్శకుడు ఈ కథ రాసుకుని ఉండొచ్చు. ప్రేమకథా చిత్రాల్లో ఇలాంటి కోణం చూడటం చాలా అరుదు. కాబట్టి ఆ మలుపు ముగింపు కాస్త విభిన్నంగానే అనిపిస్తాయి.

నటీనటులు ; ప్రమోషన్‌ల సమయంలోనే ఈ పాత్రను చాలెంజ్‌గా తీసుకొని చేశానంటూ చెప్పిన కార్తికేయ, శివ పాత్రకు న్యాయం చేసేందుకు సిన్సియర్‌గా ప్రయత్నించాడు. నాచురల్‌ లుక్‌లో రియలిస్టిక్‌గా కనిపించాడు. నిజాయితీ గల ప్రేమికుడిగా, ప్రేమకు దూరమై మూర్ఖుడిలా మారిన యువకుడిలా రెండు వేరియన్స్‌ బాగా చూపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌ సీన్‌లో కార్తికేయ నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్‌ పరవాలేదనిపించింది. నటన పరంగా ఓకె అనిపించినా, గ్లామర్‌ షో, బోల్డ్‌ సీన్స్‌తో ఆడియన్స్‌కు షాక్‌ ఇచ్చింది. రావు రమేష్ మరోసారి తనదైన నటనతో మెప్పించారు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన రాంకీ నిరాశ పరిచారు. హీరోకు పెద్ద దిక్కుగా కనిపించిన రాంకీకి ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప పెద్దగా నటనకు అవకాశం దక్కలేదు.

English Title
rx 100 movie review

MORE FROM AUTHOR

RELATED ARTICLES