బోదకాలు బాధితులకు నెలకు రూ.1,000 పింఛను

Submitted by arun on Sat, 02/10/2018 - 11:30
cmkcr

బోదకాలు బాధితులకు ప్రతి నెలా వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్ లో రాష్ట్రంలోని దాదాపు 47 వేల మంది బోదకాలు బాధితులకు పింఛన్ కేటాయింపులు జరపనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులకు కేసీఆర్ కిట్స్ పథకం వర్తింపజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో బోదకాలుతో బాధపడుతున్న వారికి పింఛన్ అందజేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సీఎం నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 47 వేల మంది బోదకాలు బాధితులకు మేలు జరగనుంది. వారికి నెలకు వెయ్యి రూపాయల పింఛనుతో పాటు అవసరమైన మందులు, ఇతర వైద్య సహకారం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. వైద్యారోగ్యశాఖపై సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బోదకాలు బాధితులకు పింఛను కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామన్నారు. 

అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో ఉన్న బోదకాలు బాధితులు తమ నియోజకవర్గాల్లో చాలామంది ఉన్నారని, వారిని ఆదుకోవాలని ఎంపీ కవిత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహా పలువురు ప్రజాప్రతినిధులు సీఎంకు విన్నవించారు. ప్రభుత్వం వారికి అండగా నిలవాలని.. వైద్యం అందించడంతోపాటు బోదకాలు వ్యాధి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది.

గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని పేదలు జబ్బు పడితే తప్ప ఆస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోని కారణంగా చాలా వ్యాధులను ప్రాథమిక స్థాయిలో గుర్తించడం లేదు. ప్రారంభ దశలో నయమయ్యే బోదకాలుని ముదిరాక కానీ గుర్తించడం లేదు. చాలా రోగాల విషయంలో ఇదే జరుగుతుండటంతో ప్రతి గ్రామంలో ప్రభుత్వ ఖర్చుతో అందరికీ వైద్య పరీక్షలు, రోగ నిర్ధారణ పరీక్షలు చేయించాలని సీఎం ఆదేశించారు. ప్రజారోగ్యం విషయంలో తెలంగాణ ఆదర్శంగా మారాలన్నది తమ లక్ష్యమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

కేసీఆర్‌ కిట్స్‌ పథకం అద్భుతంగా అమలవుతున్నదని.. దీంతో పేదలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు సీఎం కేసీఆర్. అదనపు భారం పడినా వైద్యులు,  సిబ్బంది ఓపికగా విధులు నిర్వర్తిస్తున్నారని, వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులకు కేసీఆర్‌ కిట్స్‌ పథకం వర్తింపచేయాలని వినతులు వస్తున్నా ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అవసరమైన సౌకర్యాలు, సిబ్బందిని పెంచుతామని స్పష్టం చేశారు.

Rs 1000 monthly pension to Filariasis patients CM KCR announces - Sakshi

English Title
rs 1000 monthly pension filariasis patients

MORE FROM AUTHOR

RELATED ARTICLES