నువ్వు గ్రేటబ్బా... అలుపే లేని న్యూస్‌ రీడర్‌.. ఇంట్రెస్టింగ్‌

Submitted by santosh on Sat, 11/10/2018 - 12:58
ROBO NEWS READER IN CHAINA CHANNEL

ఆ న్యూస్ రీడర్ విరామమే లేకుండా వార్తలు చదివేస్తాడు. 24 గంటలూ, 365 రోజులు వార్తలు అందిస్తూనే ఉంటాడు. అదెలా సాధ్యమంటారా? చైనాకు చెందిన అధికారిక న్యూస్‌ ఛానల్‌ జిన్హువా ఈ అద్భుతానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఏమాత్రం అలుపూసొలుపు లేకుండా నిరంతరం వార్తలు చదివే ఏఐ న్యూస్‌ యాంకర్ ఆవిష్కరించింది. అంటే.. అచ్చం మనిషిలాగే ఉండే ఓ రోబో వార్తలు చదువుతుందన్నమాట. 

తూర్పు చైనాలోని ఝెజియాంగ్‌ ప్రావిన్స్‌లో జరుగుతున్న ప్రపంచ ఐదో ఇంటర్నెట్‌ సదస్సులో ఈ ఏఐ న్యూస్‌ యాంకర్‌ను ఆ జిన్హువా ఛానల్‌ ఆవిష్కరించింది. ముదురు రంగు సూట్‌, టై ధరించి.. అచ్చం మనిషి మాదిరిగానే కళ్లు, నోరు కదుపుతూ ఆ యాంకర్‌ వార్తలు చదవడం మొదలుపెట్టాడు. ‘అందరికీ నమస్కారం.. న్యూస్‌ రీడర్‌గా ఇదే నా మొదటి రోజు’ అంటూ అతడు వార్తలు చదవడం ప్రారంభించగా.. ఆశ్చర్యపోవడం ప్రజల వంతైంది. ఆ యాంకర్ అచ్చం మనిషిలానే ఉన్నాడంటూ పలువురు ప్రశంసల్లో ముంచెత్తారు. 

ఈ సరికొత్త ఏఐ న్యూస్‌ రీడర్‌ను జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ, చైనా సెర్చ్‌ ఇంజిన్‌ సొగోవ్‌.కామ్‌ సంయుక్తంగా రూపొందించాయి. మెషీన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ ద్వారా దీన్ని అభివృద్ధి చేశారు. ఎలాంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి, వార్తలకు అనుగుణంగా ముఖ కవళికలను ఎలా మారుస్తూ భావోద్వేగాలను వ్యక్తపరచాలి తదితర అంశాల్లో ఈ న్యూస్ రీడర్‌కు శిక్షణ ఇచ్చారు. దీంతో టీవీ తెరపై అచ్చం ఓ మనిషే వార్తలు చదువుతున్నాడనే పీలింగ్ కలుగుతుందని రూపకర్తలు తెలిపారు. 

‘ఏఐ న్యూస్‌ రీడర్‌‌ మా రిపోర్టింగ్‌ బృందంలో ఓ సభ్యుడిగా మారాడు. అతడు 24 గంటలూ పనిచేస్తాడు. మా అధికారిక వెబ్‌సైట్‌, సోషల్ మీడియాలో అతడి సేవలు విరివిగా వాడుకుంటాం. ఖర్చు తగ్గించుకోవడం, సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా ఈ కృత్రిమ మేధను ఉపయోగించుకుంటున్నాం’ అని జిన్హువా ఛానల్‌ ప్రతినిధులు వెల్లడించారు.

English Title
ROBO NEWS READER IN CHAINA CHANNEL

MORE FROM AUTHOR

RELATED ARTICLES