రాంగోపాల్ వర్మ వర్సెస్ టీడీపీ ఎమ్మెల్సీ

రాంగోపాల్ వర్మ వర్సెస్ టీడీపీ ఎమ్మెల్సీ
x
Highlights

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీస్తున్నట్లు ప్రకటించడం అటు టాలీవుడ్‌తో పాటు, ఇటు తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో...

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీస్తున్నట్లు ప్రకటించడం అటు టాలీవుడ్‌తో పాటు, ఇటు తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వాళ్ల గురించి తన సినిమాలో చూపిస్తానని చెప్పడంతో సామాన్య ప్రేక్షకులకు కూడా వర్మ ప్రకటన ఆసక్తికరంగా మారింది. అయితే ఇదే విషయంపై ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన వర్మను చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. సీఎం చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ అనుమతి తీసుకున్న తర్వాతే సినిమా తీయాలని వర్మకు ఎమ్మెల్సీ సూచించారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు సినిమాను తీసి విడుదల చేస్తానంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా అడుగబెట్టనివ్వబోమని తీవ్రంగా హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరికపై వర్మ తీవ్రంగా స్పందించాడు. తన ఫేస్‌బుక్‌లో బాబూ రాజేంద్ర ప్రసాద్‌పై విరుచుకుపడుతూ ఓ పోస్ట్ పెట్టాడు. బాబూ రాజేంద్ర ప్రసాద్ ఎవడంటూ వర్మ పోస్ట్ చేశాడు. తనను తెలుగు రాష్ట్రాల్లోకి అడుగబెట్టనివ్వకపోవడానికి అవేమన్నా రాజేంద్ర ప్రసాద్ అబ్బ సొత్తా అంటూ తీవ్ర పదజాలంతో వర్మ ఘాటుగా రియాక్టయ్యాడు. ఈ పోస్ట్‌పై ఎమ్మెల్సీ కౌంటర్ ఇచ్చాడు.

వర్మకు పిచ్చెక్కిందని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. అయితే ఎవరేం చేసినా రాంగోపాల్ వర్మ మాత్రం ఈ సినిమా తీసి తీరతానని స్పష్టం చేశాడు. కోట్ల మంది తెలుగు ప్రజలను ఎన్టీఆర్ ప్రభావితం చేస్తే... ఆయనను ప్రభావితం చేసిన వ్యక్తి లక్ష్మీపార్వతి అని వర్మ చెప్పాడు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌ను ఎలా ప్రభావితం చేయగలిగింది.. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన ఎదుర్కొన్న అవమానాలేంటనే అంశాల పైనే ప్రధానంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఉంటుందని వర్మ స్పష్టం చేశాడు. ఎన్నికలకు రెండు నెలల ముందు ఈ సినిమాను విడుదల చేస్తానని కూడా ప్రకటించాడు. ఈ ప్రకటనపై టీడీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. రాంగోపాల్ వర్మ సినిమా వెనుక జగన్ హస్తం ఉందని ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories