తెలంగాణాలో కాక‌రేపుతున్న రేవంత్...టీఆర్‌ఎస్‌ సవాల్‌కు సై

Submitted by arun on Thu, 01/11/2018 - 11:43
rb

ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయముంది. ఏడాదికి ముందే అధికార, విపక్షాల మధ్య వార్‌ మొదలైంది. బహిరంగ చర్చకు రావాలంటూ నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. విద్యుత్‌ వెలుగుల వెలుగుల వెనుక అన్ని చీకటి ఒప్పందాలేనని రేవంత్‌రెడ్డి అంటుంటే తాము చెప్పేవి అబద్దాలైతే ముక్కు నేలకు రాయాలని టీఆర్ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ సవాల్‌ విసిరారు.

టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. విద్యుత్ రంగంపై బహిరంగచర్చకు సిద్ధమని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంసీ బాల్క సుమన్ సవాల్ విసురుకున్నారు. తెలంగాణ సర్కార్‌ చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాల్లో గోల్‌మాల్‌ జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ముందుచూపు నిర్ణయాలతోనే మిగుల్ విద్యుత్‌ సాధ్యమైందని రేవంత్‌రెడ్డి తెలిపారు. తక్కువ ధరకే ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఇస్తానన్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు విద్యుత్‌ను కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు.

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్‌ నేతలు భగ్గుమన్నారు. విద్యుత్‌‌రంగంపై చర్చకు రావాలంటూ కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌ విసిరారు ఎంపీ బాల్క సుమన్‌. తాము చెప్పేవి అబద్దాలైతే ముక్కు నేలకు రాస్తానన్నారు. ఒకవేళ రేవంత్‌రెడ్డి చెప్పేవి అబద్దాలైతే ముక్కు నేలకు రాయాలన్నారు. ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ కాంగ్రెస్ నేత సుబ్బరామిరెడ్డిదేనని, అవకతవకలు జరిగాయని సుబ్బరామిరెడ్డితో చెప్పించగలరా? అని ప్రశ్నించారు. 

బాల్క సుమాన్ సవాల్‌కు స్పందించిన రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్‌ సవాల్‌ను స్వీకరించారు. విద్యుత్‌పై ఈ నెల 12న మధ్యహ్నం 2 గంటలకు చర్చకు సిద్ధమని ప్రకటించారు. వేదిక ప్రగతి భవన్ అయినా సరే.. మరెక్కడైనా సిద్ధమని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. టీఆర్ఎస్ నేతలు ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయాలను వేడెక్కిస్తున్న టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు బహిరంగ చర్చలో పాల్గొంటారా ? లేదంటే మాటలకే పరిమితమవుతారా అన్నది తేలాల్సి ఉంది. 

English Title
revanth reddy vs balka suman

MORE FROM AUTHOR

RELATED ARTICLES