జాతీయపార్టీల పతనమే ప్రాంతీయ పార్టీలకు పురుడుపోసిందా?

Submitted by santosh on Wed, 05/16/2018 - 10:40
regional parties in india

తెలుగోడి ఆత్మగౌరవంతో ఎన్టీఆర్‌ ప్రభంజనం సృష్టించినా, కులాల సమీకరణలతో ఎస్పీ, బీఎస్పీ ఆవిర్భవించినా, అస్తిత్వ ఉద్యమాలతో ద్రవిడ పార్టీలు జయకేతనం ఎగురవేసినా, అది జాతీయ పార్టీల పతన పుణ్యమే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కన్పిస్తోంది. అదే ప్రత్యామ్నాయం లేదంటే మూడో కూటమికి ఆయువుపోస్తోంది. ఒకవైపు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభ తగ్గిపోతోంది. రాహుల్ నాయకత్వంలో ఒక్కోరాష్ట్రం హస్తం చేజారుతోంది. మరోవైపు బీజేపీ అసెంబ్లీ ఫలితాల్లో దుమ్మురేపుతున్నా, మోడీ వ్యతిరేక పవనాలతో లోక్‌సభ పోరులో ఓట్లు-సీట్లు తగ్గే ఛాన్సుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. దానికి నిదర్శనం, ఇంతకుముందు యూపీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌తో పాటు కొన్ని రాష్ట్రాల్లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. దాదాపు 12 స్థానాల్లో కమలం గల్లంతైంది. మరోవైపు యూపీఏ, ఎన్డీయే పక్షాలన్నీ చెల్లాచెదురవుతున్నాయి.

2014లో బీజేపీ పూర్తిమెజారిటీ సాధించినా, ఉత్తరాదిలోనే ఎక్కువ సీట్లు సాధించింది. వచ్చే ఎన్నికల్లో వీటిల్లో సగానికి తగ్గే ఛాన్సుంది. యూపీ, బీహార్‌, తరహాలో ప్రాంతీయ పార్టీలు ఏకమైతే, నరేంద్ర మోడీ, ప్రధాని పీఠం ఎక్కేంత మెజార్టీ రాకపోవచ్చు. అలాగని అక్కడ పోయిన సీట్లను దక్షిణాదిలో పూడ్చుకోవాలని కమలం రకరకాల ఎత్తుగడలు వేస్తున్నా, కేరళ, తెలంగాణ, ఏపీ, తమిళనాడులో అంత సీన్‌లేదు. కర్ణాటక తరహాలోనే సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించినా, మోడీని ప్రధానిగా మిత్రపక్షాలు ఒప్పుకునే ఛాన్స్‌లేదు. అదే ప్రాంతీయ పార్టీల ఆశ.

అలా కాంగ్రెస్, బీజేపీలు రోజురోజుకు పతనం కావడమే ప్రత్యామ్నాయ శక్తులకు ప్రేరణకలిగిస్తోంది. రాష్ట్రాలస్థాయిలో ప్రాంతీయ పక్షాలదే హవా. అందుకే రీజినల్ పార్టీలన్న ఏకం కావడానికి, అటు కేసీఆర్ ఫెడరల్‌ ఫ్రంట్, మమత కూటమి ప్రయత్నాలు, చంద్రబాబు యునైటెడ్‌ ఫ్రంట్‌ ట్రయల్స్. కాంగ్రెస్‌, బీజేపీలను కాదని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వీటి సంకల్పం. కానీ మూడో ప్రత్యామ్నాయం ఇప్పటివరకూ ముచ్చట్టుగానే మిగిలిపోయింది. అందులోనూ థర్డ్‌ ఫ్రంట్‌ నాయకుల్లో ఎవరికివారే ప్రధానమంత్రికావాలన్న ఆకాంక్షలున్నవారు. అందుకే ఈ ప్రత్యామ్నాయం సాధ్యంకాదన్న విశ్లేషణలున్నాయి. కాంగ్రెస్‌ లేదంటే బీజేపీ చెంతన చేరకతప్పదని కూడా చరిత్ర చెబుతోంది. 

సంకీర్ణ శకాలతో దేశాభివృద్ది కుంటుపడుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. మరి కర్ణాటకలో సంకీర్ణ రంగస్థలం ఆవిషృతమవుతున్న నేపథ్యంలో, ఇదే మాదిరిగా జాతీయస్థాయిలో కూటమి రాజకీయాలు వేడెక్కుతాయా...ఎన్నికలకు ముందే పొత్తు ఉంటే కర్ణాటక నిలబడేదని మథనపడుతున్న కాంగ్రెస్, మోడీ వ్యతిరేకతే ఏకైక అజెండాగా కూటమి ప్రయత్నాలు వేగవంతం చేస్తుందా...మిత్రపక్షాలు దూరమైతే చాలా నష్టమని అనుభవమవుతున్న నేపథ్యంలో బీజేపీ కూడా ఎన్డీయే చెదిరిపోకుండా జాగ్రత్తపడుతుందా...వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ చిత్రం రూపుదిద్దుకుంటుంది?

English Title
regional parties in india

MORE FROM AUTHOR

RELATED ARTICLES