అశ్లీల నృత్యాలు చేయించిన బీజేపీ ఎంపీ సోదరుడు

Submitted by arun on Sat, 12/30/2017 - 11:19

స్టేజీలు ఎక్కితే చాలు మహిళా సంక్షేమం.. నీతి, న్యాయం అంటూ సత్య వాక్యాలు వల్లవేసే నేతలే దారితప్పుతున్నారు. యువతను సక్రమార్గంలో నడిపించాల్సిన వారే.. దగ్గరుండి దారి తప్పిస్తున్నారు. మాస్ మసాలా ఐటమ్ సాంగ్స్ కు దగ్గరుండి స్టెప్పులు వేయించారు. 

మీరు చూస్తున్నఈ డ్యాన్స్ ఏ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లోదో.. సినీ ఫంక్షన్ లోదో కాదు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో యూత్ కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన డ్యాన్స్ ఫ్రొగ్రామ్. జిల్లాలోని పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు దగ్గరుండి ఈ అసభ్యకర నృత్యాలను నిర్వహించడం విశేషం. తెల్లవారితే చాలు మహిళ భద్రత, మహిళా సంక్షేమం గురించి మాట్లాడే నేతలు.. ఇలా  మహిళలతో అభ్యంతరకరమైన స్టేజ్ ఫెర్ఫామెన్స్ ఇప్పించడం వివాదస్పదమయ్యింది. 

యూత్ కల్చరల్ క్లబ్ పేరిట అశ్లీల నృత్యాలు నిర్వహించారు. దీనికి సంబంధిచిన వీడియోను ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మ బయటపెట్టారు. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరుడు నరసింహరాజు.. ఉండి వైసీపీ కన్వీనర్ నరసింహరాజు దగ్గరుండి మరీ ఈ అశ్లీల నృత్యాలు నిర్వహించడంపై మహిళా నేతలు మండిపడుతున్నారు. సాక్ష్యత్తూ ఓ పార్లమెంటు సభ్యుని సోదరుడే ఇలా అశ్లీల నృత్యాలను, అసభ్యకరమైన డ్యాన్సులను ప్రోత్సహించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. 
 
భీమవరంలోని ఓ ప్రముఖ విద్యా సంస్థకు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న వ్యక్తే.. ఇలా మహిళలతో అభ్యంతరకర డ్యాన్సులు చేస్తూ విద్యార్ధులకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని కాంగ్రెస్ మహిళా నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నేతలు తప్పులు చేస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీ నేత కూడా దగ్గరుండి ఐటమ్ సాంగ్స్ కి స్టెప్పులు వేయించారు. మహిళల ఆర్ధిక అవసరాలను ఆసరాగా తీసుకుని.. ప్రభుత్వాలు మహిళల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నాయని కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మ ఆరోపించారు. బీజేపీ, వైసీపీ పార్టీలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  
 
సాక్ష్యత్తూ ప్రజాప్రతినిధులే ఇలా రికార్డింగ్ డ్యాన్సులు, అసభ్యకరమైన నృత్యాలను నిర్వహించడంపై ప్రజలు కూడా మండిపడుతున్నారు. ప్రజలకు, యువతకు ఆదర్శంగా నిలవాల్సిన నేతలే.. ఇలా దారి తప్పుతుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 

English Title
Recording Dances In Bhimavaram!

MORE FROM AUTHOR

RELATED ARTICLES